యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బస్తాల్లోని ఎర్రటి నాణ్యమైన మిర్చిని చూపుతున్న ఈ రైతులు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు. వారం రోజులుగా మిర్చికి మంచి ధర పలుకుతోందని తమ పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం జెండాపాట క్వింటా మిర్చి ధర రూ.10,100 పలికింది. దీంతో తమ పంటకు మంచి ధరే వస్తుందని ఆశపడిన వీరికి నిరాశే మిగిలింది. ట్రేడర్లు వచ్చి క్వింటా రూ.7800గా ఖరారు చేశారు. అదేమని ప్రశ్నిస్తే 'మీ సరుకు మాకొద్దు' అంటూ కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం వరకు మిర్చిని కొనుగోలు చేయకపోవడంతో బస్తాలను చింపి మిర్చిని చూపుతూ రైతులు నిరసన తెలిపారు. దాదాపు మిర్చి రైతులందరిదీ ఇదే సమస్య. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ఈ-నామ్ అమల్లో లేకుండా తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం మిర్చి మార్కెట్‌లో వ్యాపారుల పంట పండుతోంది. రైతులు తమ పంటను మార్కెట్‌కు తెచ్చే సమయంలో క్వింటా మిర్చి రూ.5600కే కొనుగోలు చేసిన వ్యాపారులు కేవలం ఐదు నెలల్లోనే క్వింటా రూ.10,200కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఒక్కో క్వింటాకు రూ.4వేలకు పైగా కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2018అక్టోబర్ నుంచి 2019 మార్చి31లోపు మొత్తం 7.81లక్షల క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు రాగా, అందులో మార్చిలో మార్కెట్‌కు వచ్చిన 3.74లక్షల క్వింటాళ్ల మిర్చికి మాత్రమే క్వింటా రూ.9వేలకు పైగా చెల్లిస్తున్నట్టు నివేదికలు చూపుతున్నాయి. అందునా దాదాపు 70శాతం మేర పంటకు మాత్రం జెండాపాటకు సంబంధం లేకుండా క్వింటా రూ.5వేలే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖమ్మ మిర్చి మార్కెట్‌లోని కొనుగోళ్ల తీరుపై రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.