యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మన సంస్కృతి లో పాడి, పంట, పశువులు ఎంతో ముఖ్యం. పల్లెల్లో పశువులతో సహజీవనం చేస్తూ, పశువులను పూజించే సంస్కృతి మనది. వివిధ రకాల జంతువులు దేవుళ్ళకు వాహనాలుగా ఉన్నాయంటే..అది మన సంస్కృతి లో పశు సంపదకు, మనకు ఉన్న అనుబంధమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం అయన ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల స్నాతకోత్సవం లో పాల్గోని ప్రసంగించారు. పశువుల పట్ల కరుణ, సహానుభూతి ని వెటర్నరీ విద్యార్థులు చూపాలి. పశుసంపద.. దేశ సంపద..వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని అయన అన్నారు. యూనివర్సిటీల స్నాతకోత్సవం లో విద్యార్థులు పాశ్చాత్య గౌన్స్ ధరించడం మానుకుని ఇకనుండి మన సంప్రదాయ దుస్తులను ధరించాలని యూనివర్సిటీ ఛాన్సలర్ కు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులకు, వైస్ ఛాన్సలర్ కు సూచించారు. వెటర్నరీ విద్యార్థులు , సైంటిస్టులు తమ ప్రజ్ఞా పాఠవాలను, సాంకేతికతను రైతన్నలకు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. పాడి పరిశ్రమను, పశుపోషణ ను, ఇంటి ముంగిట కోళ్ల పెంపకాన్ని రైతన్నలకు ప్రత్యామ్నాయ, లాభసాటి ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి. రైతన్నలు ఆత్మహత్య లు చేసుకోకుండా ధైర్యం చెప్పాలని విద్యార్ధులకు అయన ఉద్బోధించారు. దేశ జిడిపి లో వెటర్నరీ రంగాల కాంట్రిబ్యూషన్ 4.5 శాతం వుంది. చిరుధాన్యాలు, తృణధాన్యాలను కూడా మన ఆహారపు అలవాటు గా చేసుకోవాలి. ఒంగోలు గిత్త, పుంగనూరు ఆవు , నెల్లూరు పొట్టేలు లాంటి జాతి అంతం కాకుండా పరిరక్షణకు కృషి చేయాలి. దేశవాళీ పశు జాతి సంపదను కాపాడాలి. ఆక్వా కల్చర్ ను అభివృద్ధి చేయాలని అన్నారు. వెటర్నరీ డాక్టర్లు పశువుల రోగాలను తగ్గించాలి..పశుసంపద ను కాపాడాలి. ఫాహియన్, హుయత్సాంగ్ లాంటి విదేశీ చరిత్రకారులు మన దేశ గొప్పదనం, విద్యారంగ గొప్పదనం గురించి వ్రాసారు. మన దేశం విద్యలో విశ్వ గురుగా పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి యూనివర్సిటీ లు కృషి చేయాలి. మన జనాభాలో 65 శాతం యువత..మనది యువభారతం.. యువత పాశ్చాత్య సంస్కృతి ని విడనాడి, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ను అవసరానికి అనుగుణంగా వాడుకుంటూ, టైం వేస్ట్ చేసుకోకుండా మన దేశ అభివృద్ధి కి ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఆర్థిక అభివృద్ధి దేశంగా అభివృద్ధి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. యువత.. ఆరోగ్యం కోసం యోగా ను దినచర్య గా అలవర్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. చిన్న వయసు లొనే గుండె పోటు, క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడకుండా ఉండాలి. పిజ్జా బర్గర్ లాంటి ఇన్స్టంట్ ఫుడ్ అంటే..కాన్స్టెంట్ డీసీజ్అని అయన అన్నారు. మనం ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులను, జన్మభూమి ని, మాతృభాషను, మాతృ దేశాన్ని , గురువును, గౌరవించడం యువత నేర్చుకోవాలి. మాతృభాష కళ్ళ లాంటిది.. పర భాష కళ్లద్దాల వంటిది. ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదు. గురువు గూగుల్ కంటే గొప్ప..గురువును గౌరవించడం నేర్చుకోవాలి. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ పశువులు, జంతు ప్రాణుల పట్ల కరుణ, సహానుభూతి తో మెలగాలని వెటర్నరీ గ్రాడ్యుయేట్లకు సూచించారు.