యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇ.వి.ఎంల భద్రతపై అనవసర వదంతులకు తావివ్వరాదనిఅయన అన్నారు. జిల్లా కలెక్టర్ లతో బుధ వారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, రాజకీయ పార్టీలు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయరాదని అన్నారు. అందుకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు చేపట్టాలన్నారు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రగతిలో ఉన్న పనులు, అత్యవసర పనులను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. తాగునీరు, వేసవి తీవ్రత తదితర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహన అధికారి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్రంగా పర్యవేక్షణ చేయాలని ఆయన చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిని గమనించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ మెడికల్ వాన్ లు ప్రజల ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించుటకు గ్రీవిన్స్ నిర్వహించవచ్చని ఆయన స్పష్టం చేసారు. కౌంటింగు కేంద్రాలవద్ద పూర్తి పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పోలింగ్ లో ఉపయోగించని లేదా ఇతర ఇ విఎం ల భద్రపరచడంపై అనవసరపు వదంతులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగు ఏజెంట్లను పోటీలో ఉన్న అభ్యర్థులు సకాలంలో నియమించాలని అందుకు తగిన సమాచారం అందించాలని అన్నారు. కౌంటింగు శిక్షణకు ఉపయోగించే ఇ వి ఎం ల వివరాలు ముందుగా తెలియజేయాలని సూచించారు. కౌంటింగు అనంతరం పరిణామాలపై ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని అన్నారు.