వారం రోజుల నుండి ఎండలు మండుతున్నాయి. అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. మండుతున్న ఎండలతో ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇళ్ళ నుండి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమతోపాటు కోస్తా, ఉత్తరాంధ్రలలోనూ ఎండలు భగభగ మండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ముదరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు సంస్థల నుండి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి తగ్గట్టుగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. కానీ అంతా యాక్షనే తప్ప ప్లాన్ అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రభుత్వం హడావిడిగా ఫిభ్రవరిలోనే ప్లాన్‌ను ప్రకటించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో నేటికీ అమలుకు నోచుకోకపోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కూలీలకు వేసవి నుండి ఉపశమనం పొందేందుకు ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు వేయాలని, మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులు వేసవి యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రతీ ఏటా ఈ ప్లాన్ ఉన్నప్పటికీ అమలు జరిగేది నామమాత్రమే. మజ్జిగ పంపిణీలోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై మజ్జిగ నిధుల్ని బొక్కేస్తున్నారు. తీరా కూలీలు ఆందోళన వ్యక్తం చేశాక కొంతమందికి మాత్రమే మజ్జిగ పంపిణీ చేసి దులిపేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ మొదటి వారం నుండీ ఎండలు మండుతున్నా నేటికీ షెడ్లూ వేయలేదు. మజ్జిగ పంపిణీ ప్రారంభించలేదు. తాజాగా ఉపాధి కూలీలు రాష్ట్రంలో సుమారు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. రోజు రోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. ఒక్కో కూలీకి రూ. 5 చొప్పున కేటాయించి మజ్జిగ పంపిణీ చేయాల్సి ఉంది. కానీ నేటికీ ఏ జిల్లాలోనూ అమలు కావడం లేదు.మూగజీవాలు పశుగ్రాసం కోసం అల్లాడుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు తాగునీటి కొరత ఏర్పడడంతో రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పశువులు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నాయి. తాగడానికి గొక్కెడు నీళ్ళు లేని పరిస్థితుల్లో మూగజీవాలకు నీరు ఎక్కడ నుండి తేవాలో అర్ధంకాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాయలసీయలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో తాగునీటి కోసం బిందె రూ. 8 నుండి రూ. 12 వరకూ వెచ్చించి కొనుక్కోవలసి వస్తోంది. గతంలో మాదిరిగా పశువులకు నీటి వసతి కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించడంతో ఊరి చివర ఏర్పాటుచేసిన నీటి తొట్టెలు, కుంటలు నెర్ర బారాయి. మరోపక్క పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. లారీ వరి గడ్డి రూ. 80వేల నుండి రూ. 90వేల మధ్య పలుకుతుండడంతో గ్రాసాన్ని కొని పశువుల్ని మేపడం ఇబ్బందికరంగా తయారయ్యింది. ప్రభుత్వం సరఫరా చేస్తానన్న రూ. 2 కిలో గడ్డి రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. అరకొర సరఫరాతో మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పశుగ్రాసం కొరత ఎక్కువగా ఉంది. సగం విస్తీర్ణం చెరువులుగా మారిపోయాయి. దీంతో పది లక్షల పశువులకు ఎండు గడ్డి కొరత తీవ్రంగా ఉంది. వరి యంత్రాలతో కోయడంతో కొరత ఎక్కువగా ఉంటోంది. దీంతో ట్రక్కు రూ.10 వేల నుండి రూ. 15వేలు పెట్టి కొనాల్సివస్తోంది. మరోవైపు దాణా రేట్లు పెరిగిపోయాయి. దీంతో పాడి గేదెల్ని మేపడం తమ వల్ల కావడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాలు లీటరుకు కేవలం రూ. 52 మాత్రమే రావడంతో ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన చెందుతు న్నారు. ఒక గేదెను సాకాలంటే మనిషి కూలీతోపాటు దాణా, ఎండు గడ్డి వంటి ఖర్చులకు రూ. 800లు అవుతోందని, వచ్చేది కేవలం రూ. 600 మాత్రమేనని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులొస్తాయని రైతులు అంటున్నారు. రాష్ట్రంలోని 60కు పైగా మున్సిపాల్టీల్లో మంచినీటి ఎద్దడి నెలకొంది. రిజర్వాయర్లలో నీటి కొరత ఏర్పడడం, అక్టోబర్ నుండి ఇప్పటివరకూ వర్షాలు లేని పరిస్థితుల్లో మున్సిపాల్టీలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వేసవిలో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే పరిస్థితి కేవలం ఒక్క పూటకే పరిమితం కాగా, కొన్ని చోట్ల అరకొరగా చేస్తున్నారు. దీంతో మున్సిపాల్టీల్లోని ప్రజలు వాటర్ టిన్‌లను సగటున రూ. 10 నుండి రూ.15 రూపాయల చొప్పున కొనుక్కోవలసి వస్తోంది. ఒకపక్క తిండి గింజలకు కటకట లాడుతున్న సామాన్య ప్రజలు నీటిని కూడా కొనుక్కోవలసి రావడంతో ఆర్ధికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడున్నర లక్షల మంది జనాభా ఉన్నారు. వీరికి రోజుకు 60 మిలియన్ లీటర్లు (ఎంఎల్‌డి) అవసరం కాగా, కేవలం 45 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పేరుకు 45 ఎంఎల్‌డి సరఫరా చేస్తున్నా, లీకులు పోనూ ప్రజలకు 37 ఎంఎల్‌డి మాత్రమే అందుతోంది. మంచినీటి ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని కాకినాడలో మూడున్నర కోట్ల ఎపిఎండిపి నిధులతో చేపట్టిన మంచినీటి పథకం నాలుగేళ్ళు అవుతున్నా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఓవర్ హెడ్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాలేదు. దీంతో రా వాటర్ నిల్వ చేయడానికి వీలు లేక ప్రజలకు నీటిని అందించలేకపోతున్నారు. ఇక రాజమండ్రి కార్పొరేషన్ లోనూ నాలుగు లక్షల మంది జనాభాకు 60 ఎంఎల్‌డి సరఫరా చేస్తున్నారు. కానీ 80 ఎంఎల్‌డి అవసరముంది.