ఏపీ రాజధాని గుంటూరు రాజకీయాల్లో ఇది ఓ అనూహ్యమైన పరిస్థితి..! సామాజిక వర్గాల వారీగా విడిపోయి మరీ రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నించిన హోరాహోరీ పోరుకు పరాకాష్ట. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల రెడ్డి అనూహ్యంగా పార్టీ మారిపోయారు. అంతేకాదు, చంద్రబాబు పాలనపైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ముందు అభివృద్ధి లేదని వ్యాఖ్యానించిన ఆయన తర్వాత తర్వాత ఎన్నికల సమయానికి ఏకంగా ఈ ప్రభుత్వంలో రెడ్డి వర్గానికి న్యాయం జరగడం లేదని, కేవలం కమ్మ వర్గానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉపయోగపడుతోందని అంటూ.. టీడీపీలో ఉండగానే మోదుగుల వ్యాఖ్యలు సంధించారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది.ఎన్నికల సమయానికి ముందునుంచి అందరూ ఊహించినట్టుగానే ఆయన పార్టీ మారిపోయారు. అంతేకాదు… పార్టీ మారినప్పటికీ.. అధినేత జగన్ వద్ద పట్టబట్టి మరీ ఆయన గుంటూరుఎంపీ టికెట్‌ను సాధించారు. అప్పటి వరకు ఈ టికెట్ ఖరారై.. ప్రచారం కూడా చేస్తున్న కిలారు రోశయ్యను జగన్ పొన్నూరు అసెంబ్లీకి పంపించి మరీ మోదుగులను ఇక్కడ నుంచి పోటీ చేయించారు. ఈ క్రమంలో మోదుగుల ప్రధాన లక్ష్యం కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదే వ్‌ను ఓడించడమే! ఇదే ప్రధాన అస్త్రంగా ఆయన అడుగులు వేశారు. జయదేవ్‌ను ఓడించేందుకే తాను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని… సవాళ్లు కూడా రువ్వారు. రెడ్డి వర్గాన్ని మొత్తాన్నీ కూడగట్టారు. భారీ ఎత్తున నగదును కూడా ఖర్చు చేశారు. దీంతో ప్రచారం కూడా దూకుడుగా సాగింది. దీంతో ఒకానొక దశలో ఇక, గల్లా గెలుపు కష్టమేననే సందేహాలు, సంకేతాలు కూడా వచ్చాయి. తర్వాత పరిస్థితి మారడంతో గల్లా పుంజుకున్నాడు. గుంటూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఎడ్జ్ ఉండడం గల్లాకు బాగా కలిసి వచ్చింది. నిజానికి ఇరు వర్గాల మధ్య పోరు హోరా హోరీగా సాగుతుందని అందరూ అనుకున్నా.. తీరా గుంటూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేయడం, తెనాలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పొన్నూరు సిట్టింగ్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉండడం టీడీపీకి చాలా ప్లస్ అయ్యింది. నియోజకవర్గ ప్రాంతమైన తాడికొండలోనూ టీడీపీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దీనికి తోడు ఇక్కడ వైసీపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్తవారు కావడం టీడీపీకి డబుల్ ప్లస్ అయ్యింది. అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండడంతో ఆ ప్రభావం ఎంపీపై పడింది. దీంతో గుంటూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలం మొత్తం కూడా గల్లాకు కలిసి వచ్చిందని అంచనాలు వచ్చాయి. మొత్తం 7 నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ విజయదుంధుభి మొగించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఒక్క గుంటూరు తూర్పులో మాత్రమే ముస్తాఫా గెలుపు గుర్రం ఎక్కే అవకాశం ఉంది. అదేసమయంలో ప్రత్తిపాడులో సుచరిత, డొక్కా మణిక్యవరప్రసాద్ మధ్య హోరా హోరీ పోరుసాగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవ్వరు గెలిచినా మెజార్టీ చాలా స్వల్పమే. అది ఎంపీకి మరీ ప్లస్ అయితే కాదు. ఇక, గుంటూరువెస్ట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ టీడీపీ నేత మద్దాలి గిరి, జనసేన నుంచి తోట చంద్రశేఖర్, వైసీపీ నుంచి ఏసురత్నం పోటీలో ఉన్నారు. ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి.. గల్లా గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.