ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అయినా కూడా ఫలితం వచ్చేందుకు నెల రోజులకు పైగానే సమయం ఉండడంతో ప్రతి ఒక్కరిలోనూ గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీలో గెలుపు గుర్రాలుగా భావిస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి? గెలుపు గుర్రం ఎక్కుతారా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ప్రధానంగా విశాఖలోని ఏజెన్సీ నియోజకవర్గం అరకులో పరిస్థితిపై రాజకీయ నేతలు సహా మేధావులు, విశ్లేషకులు కూడా జోరుగా చర్చిస్తున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కిడారి సర్వేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే, తర్వాత కాలంలో ఆయన టీడీపీ పంచకు చేరిపోయారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయనను హత్య చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కిడారి కుమారుడు శ్రావణ్‌కు చంద్రబాబు మంత్రిగా పోస్టింగ్ ఇచ్చి.. గిరిజనుల ఓటు బ్యాంకుపై కన్నేశారు. అరకు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు రాకపోయినా చంద్రబాబు శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆరు నెలల వరకు శ్రవణ్ ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రి అయ్యే ఛాన్సు ఉండడంతో ఆయన అటు అసెంబ్లీకి గాని, ఇటు మండలిలో కాని సభ్యుడు అయ్యే అవసరం రాలేదు. ఈ క్రమంలోనే ఆరు మాసాల పాటు మంత్రిగా ఉన్న శ్రవణ్.. తాజా ఎన్నికల్లో అరకు నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఇక, వైసీపీ నుంచి శెట్టి ఫల్గుణ, జనసేన నుంచి కిల్లో సురేంద్రలు ఇక్కడ నుంచి పోటీ చేశారు. వీరిలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఫల్గుణ గట్టి పోటీ ఇచ్చారనడంలో సందేహం లేదు. ఆది నుంచి కూడా ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌తోను, తర్వాత కాలంలో వైసీపీతోను ఉన్నారు.గత ఎన్నికల్లో ఏజెన్సీలో అన్ని సెగ్మెంట్లలో ఒక్క పోలవరం మినహా అరకు ఎంపీ సీటుతో సహా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఆ తర్వాత కొందరు గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఈ సామాజికవర్గంలో మెజార్టీ ప్రజలు, ఓటర్లు మారలేదు. ఇప్పుడు కూడా వీరు వైసీపీతోనే ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక, జనసేన కూడా ప్రజల్లో బలమైన నేతగా ఉన్న కిల్లో సురేంద్రకే అవకాశం ఇచ్చింది. దీంతో ఇక్కడ మిగిలిన పార్టీలను పక్కన పెడితే.. ప్రధాన పోరు మాత్రం శ్రావణ్, ఫల్గుణ, సురేంద్రల మధ్యే జరిగిందని అంటున్నారు. కిడారి శ్రావణ్ విషయానికి వస్తే.. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడంతో తన తండ్రి మరణానికి సంబంధించిన సెంటిమెంటు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.అదే సమయంలో ఆరు మాసాలు మంత్రిగా ఉన్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రాధమిక వైద్యాన్ని కొంతమేరకు చేరువ చేశారు. ఇది కూడా శ్రావణ్‌కు ప్రయోజనంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే కేవలం ఆరు నెలల టైం మాత్రమే ఉండడంతో ఆయన నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా చేరువ కాలేకపోయారు. ఇక ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించారు. యువ నాయకుడు, సర్వేశ్వరరావు కుమారుడిగా మంచి గుర్తింపు పొందిన శ్రావణ్‌కు గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ సానుకూలత పెద్దగా కన్పించడం లేదు. అరకు పక్కనే ఉన్న పాడేరులో వైసీపీ గెలుపునకు ఛాన్సులు ఉన్నాయంటున్నారు.