విశాఖలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు భరత్ కు దెబ్బ తీశారా....అంటే ఔననే సమాధానమే వస్తోంది. భారత యుధ్ధంలో అభిమన్యుడు అయిన వారి చేతిలోనే అసువులు బాశాడు. అన్ని విద్యలు తెలుసు అనుకున్న ఆ యువ వీరుడు వెన్నుపోట్లు మాత్రం ఉంటాయని తెలుసుకోలేకపోయాడు. ఫలితంగా కధ మొత్తం అడ్డం తిరిగింది. ఇపుడు తెలుగు భారతంలో మరో అభిమన్యుడు అలాంటి ఫలితమే చవి చూస్తున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ నా సొంతం అనుకున్న దివంగంత ఎంవీవీఎస్ మూర్తి గారి మనవడు శ్రీ భరత్ తాత చనిపోయిన నాటి నుంచి విశాఖ ఎంపీ సీటు కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. మొత్తానికి చివరి నిముషంలో టికెట్ దక్కింది. కానీ గెలుపు మాటేంటి.ఎవరైతే భరత్ మాకు కావాలి. ఆయన్నే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పెట్టండని హై కమాండ్ కి చెప్పి మరీ ఒప్పించి టికెట్ తీసుకువచ్చారు. మరి వారే చివరికి సహకరించకపోతే గెలవడం ఎలా అన్న బెంగ ఇపుడు శ్రీ భరత్ కి పట్టుకుంది. భారీ ఎత్తున ఎంపీ ఎన్నికల్లో క్రాస్ జరిగిందని తెలిసిపోయింది. ఎమ్మెల్యేకు మాత్రం సైకిల్ కు ఓటేయించుకుని ఎంపీ వద్దకు వచ్చేసరికి జనసేన అభ్యర్ధి జేడీకి ఓటు వేయించాలని అంతా కలసి పన్నిన వ్యూహం ఓ విధంగా సక్సెస్ అయింది. దాంతో ఇక్కడ ఎటువంటి ఉనికి లేని జనసేన పార్టీ, విశాఖ ఎల్లలు కూడా తెలియని ఆ పార్టీ అభ్యర్ధి జేడీ గెలిచేందుకు అన్ని రకాలుగా అవకాశాలు మెరుగయ్యాయని పోస్ట్ పోలింగ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. దీంతో హతాశుడైన శ్రీ భరత్ ఇపుడు రాజకీయల మీదనే మండిపడుతున్నారని టాక్. శ్రీభరత్ కి టికెట్ ఇప్పించడంలో ఎంతో కృషి చేసిన సీనియర్ మంత్రి కూడా క్రాస్ ఓటింగ్ చేయించే పనిలో అగ్రగామిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆయన్ని గెలిపిస్తామని చెప్పిన వారే చివరికి హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో శ్రీ భరత్ బాగా డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి ప్రచారానికి బాగానే ఇచ్చారని చెబుతున్నారు. అయినా సరే చివరికి ఫలితం వేరే విధంగా ఉందని అంటున్నారు శ్రీ భరత్ కి తూర్పు అసెంబ్లీ సీటు నుంచి మాత్రమే క్రాస్ జరగలేదని చెబుతున్నారు. అక్కడ బాలయ్య ఫ్యాన్ అయిన ఎమ్మెల్యే వెలగపూడి ఉండడమే కారణంగా చెప్పుకుంటున్నారు. మిగిలిన చోట్ల మాత్రం బాగా క్రాస్ జరిగి జేడీ కి అనుకూలంగా పోల్ అయిందని అంటున్నారు. చూడాలి మరి అసలు ఫలితం ఏంటో.