కమల్ నాధ్ కమలం పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తారా.? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హస్తం పార్టీకి అత్యధిక స్థానాలు తెస్తారా? బీజేపీ స్ట్రాంగ్ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకోగలుగుతారా? అవును… మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఆయనపై ఈ ఎన్నికలలో పెద్ద బాధ్యత ఉంది. బీజేపీ సిట్టింగ్ స్థానాలకు గండికొట్టి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం. మధ్యప్రదేశ్ లో మోదీని నిలువరించగలిగితే దేశ వ్యాప్తంగా తమకు సానుకూలత ఏర్పడుతుందన్నది హస్తం పార్టీ పెద్దల ఆలోచన.అందుకే కాంగ్రెస్ అధిష్టానం సయితం కమల్ నాధ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అంతా కమల్ నాధ్ మాత్రమే చూసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ వంటి దిగ్గజాలను కూడా పక్కనపెట్టి కమల్ నాధ్ పైనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కమల్ నాధ్ సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం తమకు కలసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కక్ష పూరిత ధోరణితో బీజేపీయేతర రాష్ట్రాల్లో ఐటీ దాడులకు దిగుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.మధ్యప్రదేశ్ లో బీజేపీకి రైతులు, ఓబీసీలు ఇంతకాలం అండగా ఉంటూ వస్తున్నారు. వారి అండతోనే శివరాజ్ సింగ్ చౌహన్ పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడాతో అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ కు చెప్పుకోలేనంత విజయం వచ్చినా ఎట్టకేలకు అధికారం మాత్రం చేపట్టగలిగింది. అందుకే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వెంటనే కమల్ నాధ్ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో రైతులు తమకు అండగా నిలుస్తారన్న నమ్మకంతో హస్తం పార్టీ ఉంది.దీంతో పాటు రాష్ట్రంలో ఓబీసీలు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు ఎన్నికలకు ముందే కమల్ నాధ్ ఓబీసీల రిజర్వేన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకూ 14 శాతం ఉన్న రిజర్వేషన్లు 27 శాతానికి పెంచారు. రాష్ట్రంలో 45 శాతం ఓబీసీలే కావడంతో వారి ఆదరణ చూరగొనేందుకు కమల్ నాధ్ ప్రయత్నించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడాపార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు ఏడు శాతం మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేస్తామని కమలం పార్టీ నమ్మకంతో ఉంది. మరి కమల్ నాధ్ కమలం పార్టీని కట్టడి చేస్తారో? లేదో? చూడాల్సి ఉంది.