పోలింగ్ రోజు ముందు వరకూ తెగ నోరు చేసుకున్న విశాఖ తమ్ముళ్ళు పోలింగ్ అనంతరం గప్ చుప్ అయిపోయారు. మిగిలిన జిల్లాల్లో నేతలు మీడియా ముందుకు వచ్చి ఒకటికి రెండు సార్లు మాట్లాడుతున్నా విశాఖలో మాత్రం నాయకులకు ఆ చురుకు పుట్టడంలేదు. నెల రోజుల ఎన్నికల ప్రచారంతో అలసిపోయారని భావించినా ఇంకా మూగనోము వీడకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. గెలుపుపై బెంగతోనా లేక ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో తెలియదు కానీ టీడీపీ నాయకులు మాత్రం ఎక్కడా బయటపడడంలేదు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ సరళిపై నివేదికలు కోరడంతో భారంగా అమరావతికి వెళ్ళి మరీ సమీక్షలో పాల్గొన్నారు. అక్కడంతా గెలుపు సైకిల్ దేనని చెప్పుకొచ్చిన తమ్ముళ్ళు ఆ ఉత్సాహం ఉన్న చోట మాత్రం చూపించలేకపోతున్నారని టాక్.ఈసారి ఎన్నికలు ఊహకు అందని విధంగా సాగాయి. ఎన్నికల తరువాత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను పంపించి ఓటర్ల లోగుట్టు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఓటరు ఎక్కడా తొణకలేదు. దాంతో మరింత అయోమయానికి నేతాశ్రీలు గురి అయ్యారని తెలుస్తోంది. ఇక పార్టీలో సిట్టింగులకు టికెట్లు మళ్లీ ఇవ్వడం వల్ల అసమ్మతి బాగానే రాజుకుంది. దాంతో ఇంటి కష్టాలు ఈ ఎన్నికల్లో ఎంతవరకూ మైనస్ అయ్యాయో తెలియక తమ్ముళ్ళు బుర్ర పట్టుకుంటున్నారు. విశాఖ సౌత్ నుంచి సిట్టింగ్ వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు సొంత పార్టీలోని నేతల నుంచే పెద్దగా సహకారం దక్కలేదని పోలింగ్ అనంతర పరిశీలనతో తేలడంతో ఖంగు తిన్నారని టాక్.అదే విధంగా గాజువాకలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కి ఇటు సొంత పార్టీ నాయకులతో పాటు, అటు హై కమాండ్ దోబూచులాట కలసి మూడవ స్థానానికి నెట్టేశాయని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ పోటీ కారణంగా చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేయకపోవడం తెలిసిన సంగతే. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావుకు సైతం ఉత్తరంలో తమ్ముళ్ల నిరాదరణ కొంత ఇబ్బంది కలిగించిందని భోగట్టా. భీమిలీలో కాంగ్రెస్ నాయకుడుగా ఉంటూ సైకిలెక్కిన సబ్బం హరికైతే అక్కడ నాయకులు చుక్కలే చూపించారు. ఇదే వరసలో పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తికి కూడా పార్టీలో వెన్నుపోట్లు తగిలాయని అంటున్నారు.
అర్బన్ జిల్లావరకూ చూస్తే విశాఖ తూర్పు అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబు అదృష్టవంతుడంటున్నారు. ఆయన గెలుపుపై ఎవరికీ సందేహాలే లేవు. రూరల్ జిల్లాలో సైతం ఈసారి క్యాడర్ బాగా వెనకబడిందని, 2014 నాటి హుషార్, ఊపు లేవని అభ్యర్ధులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. మొత్తానికి గెలిచేస్తామని చంద్రబాబుకు నివేదికలు అంతా ఇచ్చారు కానీ ఎందరు తమ్ముళ్ళు మళ్ళీ అసెంబ్లీ ముఖం చూస్తారో ఫలితాలే చెప్పాలి