యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పశ్చిమగోదావరి :
కూలీలకు భరోసా కల్పించే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ గాయపడితే వారికి కనీస చికిత్స అందడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో కూలీలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నా వారికి కనీస అవసరమైన ప్రథమ చికిత్స కిట్లను అధికారులు సమకూర్చలేక పోతున్నారు. అసలే వేసవి. దానికి తగినట్టు ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. ఏడాదిగా ఇవి అందుబాటులో ఉండటం లేదు. చిన్నచిన్న గాయాలైనా ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేక ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 909 గ్రామపంచాయతీల్లో 2313 ఆవాసాల్లో ఉపాధిహామీ పథకం పనులు జరుగుతున్నాయి. మొత్తం 7,43,769 జాబుకార్డులు ఉన్నాయి. 6,67,329 మంది కూలీలు పనిచేస్తున్నారు. జిల్లాలో ఉపాధి పథకం పనులు చేసే ప్రదేశాల్లో ఈ ప్రథమచికిత్స కిట్లు అందుబాటులో ఉంచుతుంటారు. 40వేల కిట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ ఏడాది కాలంగా ఇవి అందుబాటులో లేవు. వివిధ కారణాలతో టెండర్లు పిలవలేదు. కొనుగోలు చేయనేలేదు.
గత ఏడాది మే నెలలో ప్రథమ చికిత్స కిట్లు సమకూర్చడానికి టెండర్లు దాఖలు చేశారు. అయితే వీటిలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి జిల్లా అధికారులు టెండర్లు రద్దు చేశారు. ఆ తరవాత జిల్లా నీటి యాజమాన్య పథక సంచాలకులుగా ముగ్గురు మారారు. గత ఏడాది ఎం.వెంకటరమణ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్లు గణేశ్‌కుమార్ ఈ బాధ్యతలు నిర్వహించారు. గణేశ్‌కుమార్ బదిలీ అయిన తరవాత మళ్లీ వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. దాంతో పనులు మందగించాయి. వీటిపై దృష్టి సారించలేదు. మళ్లీ పనులు ప్రారంభించే సమయానికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అధికారులు బదిలీ అయ్యారు. దాంతో అధికారులు కూడా ఎన్నికల పనులపై దృష్టి సారించి ఉపాధి హామీ పథకంలో వసతులు గురించి పట్టించుకో లేదు. ప్రథమ చికిత్స కిట్లు సమకూర్చేందుకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రథమ చికిత్స కిట్‌లో ఒక కత్తెర, దూది ప్యాకెట్టు, సేవలాన్ లిక్విడ్, రోలార్ బ్యాండేజీ, ప్లాస్టర్లు వంటివి ఉంటాయి. పనులు చేసే సమయంలో కూలీలకు గాయాలవ్వడం సహజం. చిన్నచిన్న గాయాలైనప్పుడు పని ప్రదేశంలోనే ప్రథమ చికిత్స చేయాల్సి ఉంది. అప్పటికీ పెద్దగాయమైతే ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ ప్రథమచికిత్స కిట్లు లేకపోవడంతో చిన్న చిన్న గాయాలకు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది.