YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో ఎమ్మెల్యేలే అంతా చేస్తున్నారా...

టీడీపీలో ఎమ్మెల్యేలే అంతా చేస్తున్నారా...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తలెత్తడానికి ఎవరో కాదట. సొంత పార్టీ నేతలేనని ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబు నాయుడు జరుపుతున్న వరుస సమీక్షల్లో ఈ విషయం స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన హోరాహోరీగా సాగాయి. అయితే గెలుపు తమదంటే తమదేనని ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పైకి ధీమాగా ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా గెలుపు ఖచ్చితంగా తమదేనని నేతలకు చెప్పారు. అయితే నియోజకవర్గాల వారీగా జరిపిన సమీక్షల్లో తేలిందేమిటంటే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని ఇరకాటంలో నెట్టారట.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పోలింగ్ కు ముందు రోజు డబ్బు పంపిణీ సక్రమంగా జరగలేదని గుర్తించారు. ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు మూడు రోజుల ముందు నుంచే డబ్బు పంపిణీ చేపట్టినా, చివరి రోజు ఇస్తే ఓటర్లు గుర్తు పెట్టుకుంటారని తెలుగుదేశం పార్టీ నేతలు ఈ నెల 10వ తేదీన ఓటర్లకు డబ్బు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఓటర్లకు చేరాల్సిన డబ్బులు చేరలేదని పోలింగ్ అయిపోయిన తర్వాత కాని తెలియలేదట. చాలా చోట్ల అభ్యర్థులు డబ్బులిచ్చినా వాటిని ఓటర్లకు పంచలేదని తెలిసి అవాక్కయ్యారట.ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పోలింగ్ కు ముందు రోజు డబ్బులు పంపిణీకి అభ్యర్థి సిద్ధమయ్యారు. దాదాపు రెండు కోట్ల రూపాయలను ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించి ఓటర్లకు ఇచ్చే బాధ్యతను అప్పగించారు. కానీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం డబ్బులు పంచకుండానే పంచామని చెప్పేశారట. ప్రకాశం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని ఆయన భావించారు. కానీ పోలింగ్ కు ముందు రోజు ద్వితీయ శ్రేణినేతలు తనను మోసం చేశారని ఆయన ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల ఉండవల్లి లో జరిగిన చంద్రబాబు జరిపిన సమీక్ష సమావేశంలో ఆయన చెప్పినట్లు తెలిసింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు ద్వితీయ శ్రేణి నేతలను దగ్గరకు రానివ్వకపోవడంతో పాటు వారికి ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనాలు కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందంటున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం దండిగా సంపాదించారని క్యాడర్ వారిపై ఆగ్రహంగా ఉందంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణినేతల్లో ఉన్న కసి వీరిలో కన్పించలేదని వారు వాపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ద్వితీయ శ్రేణి నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని గుర్తించారు. వీరందరిపై తగిన చర్యలుంటాయని చంద్రబాబునాయుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఈఎన్నికల్లో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలే శత్రువులుగా మారారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Related Posts