యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తమిళనాట మరో దారుణం వెలుగుచూసింది. పసిబిడ్డల్ని అంగడిసరుకులుగా మార్చిన వ్యవహారం ఫోన్‌కాల్ లీక్‌తో గుట్టురట్టయ్యింది. మగబిడ్డ రూ.4లక్షలు, ఆడబిడ్డ రూ.3 లక్షలు, ఎర్రగా ఉంటే ఒక రేటు, నల్లగా ఉంటే మరో రేటు... పైగా బర్త్ సర్టిఫికేట్‌తో ముక్కు పచ్చలారని పసికందుల అమ్మకం ముప్పై యేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగిన దారుణం గురువారం బట్టబయలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి నిరుపేద దంపతులు, తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోని దంపతుల నుంచి స్వచ్చంద సంస్థలు నడిపే అనాథాశ్రమాల నుంచి తీసుకొచ్చిన పసికందులను సంతాన భాగ్యానికి నోచుకోని దంపతులకు విక్రయించి ఓ ముఠా కోట్లు గడించింది. నామక్కల్ జిల్లా రాశిపురంలో జరిగిన ఈ పసికందుల అమ్మకం గుట్టు ఒక ఫోన్‌కాల్‌తో రట్టయ్యింది. నామక్కల్ జిల్లాలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పసికందుల అమ్మకాలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ విచారణకు ఆదేశించారు. పసికందుల విక్రయానికి పాల్పడిన ప్రభుత్వ ఆస్పత్రి రిటైర్డ్ నర్సు అముద ఆమె భర్త రవిచంద్రన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నర్సు అముద తన పలుకుబడితో స్వచ్చంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుని, వాటి నిర్వాహకుల అండదండలతో పురపాలక సంఘం అధికారుల మద్దతుతో జోరుగా పసికందులను విక్రయించినట్ట్లు ఆరోపణలు వస్తున్నాయి. 30 ఏళ్లుగా ఆమె పసికందుల విక్రయం ముఠాకు ఏజెంటుగా పనిచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.