YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జరాభద్రం... పిడుగులు పడే అవకాశం

జరాభద్రం... పిడుగులు పడే అవకాశం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. మరో అరగంటలో విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఓ ప్రకటనలో తెలిపింది.విశాఖ జిల్లాలో జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట, చింతపల్లి, పాడేరు, అరకు, డుంబ్రిగూడ ప్రాంతాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లాలో వై.రామవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పిడుగులు పడతాయని తెలిపారు.అంతేగాకుండా, శ్రీకాకుళం జిల్లాలోని భామిని, కొత్తూరు, పాతపట్నం, సీతంపేట ప్రాంతాల్లో పిడుగులు పడతాయని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించారు. కాగా, ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ప్రజలు ఈ సమయంలో ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. మైదానాల్లో, చెట్ల కింద ఉండరాదని, పొలం పనులకు వెళ్లవద్దని తెలిపారు. ముఖ్యంగా, పశువుల, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొన్నారు.వాయుగుండం క్రమంగా బలపడుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయదిశగా 1760 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాయుగుండం మరో 36 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో, కేరళలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వాయుగుండం బలపడి తుపానుగా మారిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈ నెల 30న పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.వాయుగుండం తుపానుగా మారితే బంగ్లాదేశ్ సూచించిన 'ఫణి' అనే పేరుతో పిలుస్తారు. ఫణి అంటే సర్పం అని తెలిసిందే. ఇది పేరుకు తగ్గట్టే వంపులు తిరుగుతూ పయనించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  దక్షిణ తమిళనాడులో తీరం దాటిన తర్వాత బలహీనపడిపోకుండా తీరాన్ని అంటిపెట్టుకుని ఏకంగా ఏపీ మీదుగా ఒడిశా వరకు పయనించే అవకాశాలు ఉన్నాయని పాశ్చాత్య వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.పశ్చిమ వాయవ్య దిశలో తీరం దాటిన అనంతరం, ఉత్తర దిశగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తుపానులకు సంబంధించి ఇదొక అసాధారణ స్థితి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లేదా, తమిళనాడు తీరాన్ని తాకకుండా నేరుగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా విశాఖపట్నం, ఒడిశా తీరాన్ని తాకుతూ ఈశాన్య దిశగా పయనించవచ్చన్నది మరో అంచనా!

Related Posts