YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

డిజిటల్ ప్రచారం ఖర్చు 500 కోట్లపైనే

డిజిటల్ ప్రచారం ఖర్చు 500 కోట్లపైనే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆన్‌లైన్ ప్రచారానికి సంబంధించిన ఖర్చు గత ఎన్నికలతో పోలిస్తే ద్విగుణీకృతం కానుంది. ఎన్నికలు పూర్తయ్యే నాటికి సుమారు రూ. 400 నుంచి 500 కోట్లకు ఈప్రచార ఖర్చులు చేరుకోవచ్చని అంచనా. ప్రజల్లో పెరిగిన స్మార్ట్ఫోన్ వినియోగాన్ని, ఇంటర్నెట్ ప్యాక్‌లు స్వల్ప ధరలకే అందుబాటులో ఉండడాన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగా డిజిటల్ స్పేస్‌లో ఎక్కువగా ప్రకటనలు చేయడం ద్వారా అగ్ర స్థానాన్ని భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఆక్రమించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ప్రచార ఖర్చులు రూ. 2,500 నుంచి 3000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు దేంట్సు ఎయిజిస్ నెట్‌వర్క్ గ్రేటర్ సౌత్ చైర్మన్, సీఈవో ఆశిష్ భాసిన్ తెలిపారు. ఇందులో సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర డిజిటల్ వేదికల ద్వారా జరుగుతున్న ప్రచారం సుమారు రూ. 500 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేసినట్టు పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల ప్రచార ఖర్చులో మందీ మార్బలాలు, ప్రచార సభలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, ఇందులో ప్రభుత్వ పథకాలు, పనితీరుపై చేసే ప్రకటనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల నుంచి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో దాని ఆధారంగా రాజకీయ పార్టీలు సైతం ఆన్‌లైన్ ప్రచారంపై తమ బడ్జెట్ కేటాయింపులు పెంచాయని మరో అడ్వర్టయింజింగ్ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా టెలికాం ఆపరేటర్లు కూడా స్వల్ప ఖర్చుతో కూడుకున్న ప్యాకేజీలు ఇస్తున్నాయన్నారు. ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లోని ముఖ్య నియోజకవర్గాల విషయంలో ఈ తరహా ప్రచారం అధికంగా సాగుతోందని ఆయన తెలిపారు. గూగుల్ రాజకీయ ప్రచార పారదర్శకత అధ్యయన నివేదిక మేరకు పలు డిజిటల్ సెగ్మెంట్లలో గత ఫిబ్రవరి నుంచి చేసిన ప్రచార ఖర్చు ఇప్పటికే రూ. 86,311,600 దాటింది. అదే విధంగా ఫేస్‌బుక్ విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే మొత్తం 61,248 ప్రచార ప్రకటనలపై రూ. 121,845,456 ఇప్పటి వరకు ఖర్చ చేసినట్టు వెల్లడైంది. మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న 2019 సార్వత్రిక ఎన్నికలు మే 19న ముగియనున్న సంగతి తెలిసిందే.

Related Posts