YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనేవారెవరు..?

కొనేవారెవరు..?

కృష్ణాజిల్లా :

ఆరుగాలం కష్టించి మినుములు పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు పెడతారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఎక్కువశాతం మంది అపరాలు సాగుచేశారు. బంటుమిల్లి, బందరు తదితర ప్రాంతాల్లో మాత్రం వేరుసెనగ వేశారు. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో మినుము సాగయ్యింది. పెడన, గూడూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు ఇలా పలు మండలాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ నూర్పిళ్ల ప్రక్రియ పూర్తయ్యింది. చివరిగా వేసిన పంటను కూడా ఇటీవల నూర్పిడి చేశారు. ఎక్కడ చూసినా ఒకటి రెండు బస్తాలకు మించలేదు ఎక్కడన్నా బాగా పండితే అత్యధికంగా నాలుగు బస్తాలు వచ్చాయి. అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. ఎకరానికి రూ. 15వేల నుంచి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టారు. ఈ స్థితిలో వచ్చిన దిగుబడులు చూసి పెట్టుబడి కూడా మిగలదని రైతులు వాపోతున్నారు. వచ్చే దిగుబడులతో పోల్చుకుంటే నష్టమే మిగులుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో ధర లేక ఎక్కడికి అక్కడే నిల్వ చేసుకున్నారు.
మినుముకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.5,600 ప్రకటించింది. ఈ ధరకు అమ్మినా రూపాయి కూడా మిగలదు. ఇప్పటికే పురుగు మందులకు అప్పుచేసి పెట్టారు. వచ్చే డబ్బుల్లో ఏమీ మిగలకపోగా అప్పులు తీర్చడానికి కూడా సరిపోవని విచారం చేస్తున్నారు. పంట ఉత్పత్తి, దుకాణాల్లో విక్రయించేదానికి తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. దీన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాలని కోరుతున్నారు.  జిల్లాలోని ఆయా ప్రాంతాల వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు మినుము కొనుగోలు చేసి ఎక్కువధరకు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు అమ్ముకోవాలంటే కొనుగోలు కేంద్రాలు అవసరం. అవి ఇంతవరకూ తెరుచుకోలేదు.
సమయంలో ఏర్పాటు చేయకపోతే రైతులు నష్టపోవాల్సివస్తుంది. ఆ తరువాత ఏర్పాటు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉన్నతాధికారులు ఆలోచించి త్వరితగతిన కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్రాలు ఏర్పాటు చేసేముందు మార్క్‌ఫెడ్‌ అధికారులు జిల్లాల్లో ఉన్న పంట వివరాలు తీసుకుంటారు. అలా జిల్లా వ్యవసాయశాఖ వచ్చిన దిగుబడులను బట్టి అంచనాలు వేసి పంపిస్తారు. మార్కెటింగ్‌ శాఖ మాత్రం అంతగా పట్టించుకోవడంలేదు. ప్రతి ప్రాంతంలోని ఇళ్లలో క్వింటాళ్లకొద్దీ మినుములు నిల్వ ఉన్నాయి.

Related Posts