యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో సాధారణ ఎన్నికల ఫలితాల్లో టిడిపి, వైసిపి గెలుపోటములపై బెట్టింగులు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ ? సీట్లు వస్తాయి, చంద్రబాబు సీఎం అవుతాడా ? జగన్ సీఎం అవుతాడా ? పవన్ ఎమ్మెల్యే అయిన గెలుస్తాడా ?పవన్ పార్టీ ఎన్ని? సీట్లు గెలుచుకుంటుంది, వైసిపికి ఎన్ని ? సీట్లు వస్తాయి ఇలా రకరకాలుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. వైసీపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది… టీడీపీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి ఇలా స్టేట్ వైడ్ పందాలతోపాటు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై టిడిపి, వైసిపి సానుభూతిపరులు గెలుపు నుంచి మెజార్టీ వరకు పందేలు కాస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో టిడిపి టోటల్‌గా క్లీన్‌స్వీప్ చేసేసిన పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీ సానుభూతిపరులు సవాళ్లు రువ్వి మరీ పందానికి దిగుతున్నారు. జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీ బాగా పుంజుకుంది అన్న అంచనాల నేపథ్యంలో వైసిపి సానుభూతిపరులు కొన్ని సీట్లలో ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఘంటా పథంగా చెబుతున్నారు.ఈ క్రమంలోనే జిల్లాలో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు సీట్లలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని మూడు సీట్లలో ఏ ఒక్క సీటు టిడిపి గెలిచినా తాము పందెం వదిలివేస్తామని… మూడు సీట్లు వైసీపీ గెలిస్తేనే తమకు డబ్బులు ఇస్తే చాలని పందెం రాయుళ్లు సవాళ్లతో పందేలకు దిగుతుండటం జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఆసక్తిని రేపుతోంది. ఏలూరు ఎంపీ పరిధిలో ఉన్న టిడిపి కంచుకోట దెందులూరు నియోజకవర్గంలో సైతం టిడిపి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓడిపోతాడని వైసిపి వాళ్ళు పందేలు కాస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త విషయం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఏలూరు లోక్‌సభ పరిధిలో ఉన్న చింతలపూడి, ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వైసిపి గెలుస్తుందన్న ధీమా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ మూడు సీట్లలోను వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని… ఏ ఒక్క సీటు టీడీపీ గెలిచిన తాము పందెం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ వాళ్ళు హెచ్చు పందేలకు దిగుతుండటం మెట్ట ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.ఈ మూడు సీట్లలో ఉంగుటూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి టిడిపి తరఫున రంగంలో ఉన్నారు. ఇక చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పీతల సుజాతని పక్కన పెట్టిన టీడీపీ అధిష్టానం కర్రా రాజారావుకు ఇచ్చింది. ఇక వైసిపి లెక్కలు ఇలా ఉంటే టిడిపి ఈ మూడు సీట్లలో ఖచ్చితంగా రెండు గెలుస్తామని ధీమాతో ఉంది. ఈ మూడు సీట్లలో రెండు పార్టీల గెలుపు ఓటములే ఖచ్చితంగా ఏలూరు పార్లమెంటు విజేతను నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా ఈ పందెంపై సమ పందేనికి రెడీ అయిన వైసీపీ ఇప్పుడు హెచ్చు పందెం ఇచ్చేందుకు కూడా సిద్ధంగానే ఉంది. ప్రస్తుతం పశ్చిమలో ఆసక్తి రేపుతున్న పందాల్లో ఒకటిగా ఉన్నా ఈ పందెంలో వైసీపీ బెట్టింగ్ రాయుళ్లు పైచేయి సాధిస్తారా ? లేదా చతికిల పెడతారా అన్నది 23న ఫలితాల్లో తేలిపోనుంది.