యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మీరు రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా? అని గతంలో మీడియా ఆమెను ప్రశ్నించగా.. వై నాట్ వారణాసి అని ఆమె ఎదురు ప్రశ్నించారు. దీంతో వారణాసి నుంచి ప్రియాంక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారంతా. తీరా చూస్తే గత ఎన్నికల్లో పోటీ చేసిన అజయ్ రాయ్ పేరునే మరోసారి ఖాయం చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేయొద్దనేది ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ నేత శ్యామ్ ప్రిటోడా తెలిపారు. ఓటమితో తన ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించొద్దనే కారణంతోనే ప్రియాంక వెనక్కి తగ్గారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రియాంక గాంధీ వెనక్కి తగ్గడం వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తన్నారు. ఆమె వారణాసిలో పోటీ చేస్తే తన ఫోకస్ మొత్తం ఆ నియోజకవర్గం మీదే పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా తూర్పు యూపీ ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రియాంక.. ఆ ప్రాంతంలోని నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేరు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుంది. యూపీలో కనీసం 15 చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యూపీలో పలు చోట్ల వ్యూహాత్మకంగా అభ్యర్థులను నిలబెట్టింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రవి కిషన్‌ను బీజేపీ బరిలో దింపగా.. కాంగ్రెస్ కూడా అదే వర్గానికి చెందిన మధుసూదన్ తివారీకి సీటిచ్చింది. ఇది పరోక్షంగా ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఉపకరించే అవకాశం ఉంది. ఇలా పలు చోట్ల బీజేపీని దెబ్బతీసేలా కాంగ్రెస్ అభ్యర్థులను నిలిపిందని తెలుస్తోంది.యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలపడం కోసమే ప్రియాంకను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించడానికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదని మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.