YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐదు గంటల పాటు నిలిచిన శ్రీ వారి దర్శనం

ఐదు గంటల పాటు నిలిచిన శ్రీ వారి దర్శనం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుమలలోని శ్రీవరాహస్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును 37 ఏళ్ల అనంతరం నిర్వహిస్తున్నారు. ఈ వైదిక క్రతువు శనివారంతో ముగియనుంది. దీంతో శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు దాదాపు 5 గంటల పాటు దర్శనం నిలిపివేశారు. శ్రీవరాహస్వామి ఆలయంలో ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ క్రతువును కర్కాటక లగ్నంలో జరగనుంది. అనంతరం ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం, రెండో గంట తదితర పూజాదికాలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలోనూ ఘంటానాదం, నిత్యకట్ల కైంకర్యాలు ఉంటాయి. శ్రీవారి దర్శనాన్ని 5 గంటల పాటు, వీఐపీ దర్శనాన్ని పూర్తిగా టీటీడీ రద్దు చేసింది. వీటితోపాటు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను రద్దు చేశారు. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. అనంతరం మహాసంప్రోక్షణలో భాగంగా యాగశాలలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని బింబంలోకి ఆవాహన చేస్తారు. ఈ వైదిక కార్యక్రమంతో శ్రీవరాహస్వామి, శ్రీవిష్వక్సేనులవారు, శ్రీరామానుజాచార్యులు, పుష్కరిణి వద్ద శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని విగ్రహాలకు దైవశక్తి చేకూరుతుంది. మహాసంప్రోక్షణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీవరాహస్వామికి మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాల్లో భాగంగా శయనాధివాసం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా విశేష ఆరాధ‌న‌లు, నైవేద్యాలు స‌మ‌ర్పించి, అక్ష‌తారోప‌ణం చేస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు శ్రీ వ‌రాహ‌స్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగిస్తారు. 

Related Posts