YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాలుగు రాష్ట్రాల్లోని ఆ సీట్లే పైనే గురి

 నాలుగు రాష్ట్రాల్లోని ఆ సీట్లే పైనే గురి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 105 స్థానాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న పార్టీలకు పరీక్ష పెట్టబోతున్నాయి. ఇప్పటికి మూడు విడతల పోలింగు ముగిసింది. దాదాపు 300 స్థానాల్లో ప్రజలు తమ ప్రతినిధుల ఎంపికను పూర్తి చేసుకున్నారు. ఫలితం వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ పోలింగు సాగిన తీరు, ఓటింగు సరళి అంచనా వేసుకుంటున్న పార్టీలు మిగిలిన నాలుగు ఫేజులపైనా ఒక అంచనాకు వస్తున్నారు. జాతీయ పార్టీలుగా కేంద్రప్రభుత్వ ఏర్పాటుకు పోటీపడుతున్న బీజేపీ, కాంగ్రెసులు రెంటికీ కొరుకుడు పడని స్థానాలు 105 వరకూ ఉన్నాయి. ఎన్డీఏ, యూపీఏ కూటములకు చెందని పార్టీలదే అక్కడ పెత్తనం. ఇవి నాలుగు రాష్ట్రాలకు చెందిన స్థానాలు. ఈ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు చెట్టెక్కి కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం బీజేపీ, కాంగ్రెసులు రెండూ కూడా 200 లోపు స్థానాలకు పరిమితమవుతాయి. కాంగ్రెసు పార్టీ వంద నుంచి 120 స్థానాల మధ్య నిలిచిపోతుందని లెక్కలు వేస్తున్నారు. బీజేపీ 165 నుంచి 185 స్థానాల మధ్య కుచించుకుపోయే సూచనలున్నాయి. కాంగ్రెసు కూటమికి మిత్రులతో కలిసి మరో 52 స్థానాలు సమకూరవచ్చంటున్నారు. బీజేపీ కూటమికి మాత్రం అదనంగా 40 స్థానాలు దక్కుతాయని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తమ్మీద యూపీఏ కూటమికి కనీసం గా 100 స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరితనే అధికారం దక్కుతుంది. అదే ఎన్డీఏ కూటమికి 60 స్థానాలు అవసరమవుతాయి. దాదాపు 105 స్థానాలను తమ గుప్సెట్లో పెట్టుకుంటున్న పార్టీలపై ఈ రెండు కూటములు ఆధారపడాల్సి ఉంటుంది.ఉత్తరప్రదేశ్ తీర్పు ఎటు చెబితే అటువైపే కేంద్రంలో అదికారం అనేది పాత నానుడి. 2014 వరకూ చెల్లుబాటయ్యింది. ఇప్పుడిక్కడ రెండు ప్రధాన పక్షాలు పోటీపడుతున్నాయి. ఎస్పీ,బీఎస్పీ, ఆర్ ఎల్డీ తో కూడిన కూటమి , బీజేపీ, కాంగ్రెసు. దాంతో ఓట్లు, సీట్ల చీలిక అనివార్యమవుతోంది. ఏ పక్షమూ 40 సీట్లు మించి సాధించవని రాజకీయ పండితులు లెక్కలు తేల్చేస్తున్నారు. దాంతో యూపీ ప్రాధాన్యం కుచించుకుపోయింది. కాంగ్రెసుకు ఇక్కడ నామమాత్రపు ప్రాతినిధ్యమే. రాయబరేలీ, అమేథీ మినహా మిగిలిన చోట్ల పెద్దగా ఆశలు లేవు. బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా బలపడింది. అయినప్పటికీ సమాజ్ వాదీ, బహుజనసమాజ్, రాష్ట్రీయ లోక్ దళ్ చేతులు కలపడంతో గట్టి సవాల్ ను ఎదుర్కొంటోంది. అంతటి పోటీలోనూ 35 స్థానాల వరకూ గెలుచుకోగలుగుతుంది. ఇక కూటమి బలం కూడా 40 లోపునకు పరిమితమవుతుంది. ఏ పార్టీవైపునకూ స్వీపింగ్ కనిపించకపోవడంతో మిగిలిన రాష్ట్రాలు ఈసారి కేంద్రప్రభుత్వ గతిని నిర్ణయించబోతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 42స్థానాలు ఉండేవి. ఇప్పుడు ఏపీ 25కేపరిమితమైంది. అయితే ఇక్కడ టీడీపీ, వైసీపీ రెంటికే మొత్తం స్థానాలు దక్కుతాయి. టీడీపీకి డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి. వైసీపీ ని కేసుల భారం వెంటాడుతోంది. ఆయా విషయాలను పరిష్కరిస్తామన్న జాతీయ పార్టీలకే వాటి మద్దతు లభిస్తుంది. అందుకే ఏపీ ఇచ్చే తీర్పుపై జాతీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. 17 స్థానాలతో కూడిన తమ రాష్ట్ర బలం చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి లేదు. అందుకే వైసీపీని దువ్వుతున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న 42 స్థానాల బలాన్ని ఒక్కటిగా చూపాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏపీకి ప్రత్యేక హోదా వంటి డిమాండ్లకు మద్దతు పలికేందుకు సైతం సిద్దపడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట హడావిడి చేస్తున్నప్పటికీ ఆయన లెక్క తెలుగురాష్ట్రాలపైనే కేంద్రీక్రుతమై ఉంది. గతంలో ఆయన చర్చలు జరిపిన జనతాదళ్ సెక్యులర్, తృణమూల్ కాంగ్రెసు, బిజూ జనతాదళ్ ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పటికి సానుకూలంగా స్సందించింది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే. అయితే చేతులు కలిపేందుకు వైసీపీ కొన్ని షరతులు పెట్టే సూచనలున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల చిక్కుముడి నుంచి అధినేతను తప్పించాలనే డిమాండు కూడా ప్రధానమైనదే. ఈవిషయంలో కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించగలిగితే జగన్ కు పెద్దగా అభ్యంతరాలుండవు. టీడీపీ పార్టీ పూర్తిగా దెబ్బతిని నాలుగైదు స్థానాలకు పరిమతమైతే మాత్రమే వైసీపీ, టీఆర్ఎస్ కాంబినేషన్ సాధ్యమవుతుంది. మళ్లీ టీడీపీ గెలుపు బాట పడితే కేసీఆర్ ప్రాధాన్యం పెద్దగా ఉండదు. బీజేపీతో మాత్రమే ఆయన కలిసి వెళ్లవలసి ఉంటుంది. మిగిలిన పార్టీలను చంద్రబాబు నాయుడు కూడగట్టగలుగుతారు. మమతా బెనర్జీకి మంచి డిమాండ్ పెరిగింది. ఆమెను ఆకట్టుకోవాలని కాంగ్రెసు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు మమత తనతో ఆత్మీయంగానే ఉంటారని ప్రధాని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీగా నిలుస్తోంది తృణమూల్ కాంగ్రెసు. బీజేపీ, కాంగ్రెసు, అన్నాడీఎంకే ల తర్వాత ఆ పార్టీకే అత్యధిక సంఖ్యలో సీట్లున్నాయి. ప్రస్తుతం 34 సీట్లున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగైదు సీట్లు తగ్గవచ్చని అంచనా. అయినప్పటికీ 30 స్థానాలు అంటే తక్కువేం కాదు. అందుకే కాంగ్రెసు అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ తృణమూల్ వైపు ఆశగా చూస్తోంది. బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా పశ్చిమబంగ లో తలపడుతోంది. అందుకే ప్రస్తుతానికి మమత తో ఢీ అంటే ఢీ అంటోంది. కానీ ఎన్నికల అనంతరం మెజార్టీ మార్కుకు కొరత ఏర్పడితే కయ్యం కాస్తా వియ్యంగా మార్చుకోవడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరోవైపు యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా 150 స్థానాలతో ఫ్రంట్ కట్టాలనుకుంటున్న ఏపీ, టీఎస్ సీఎంలు చంద్రబాబు, చంద్రశేఖరరావులు సైతం మమతపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎస్పీ, బీఎస్సీలతోపాటు బీజేడీ, తృణమూల్ కూడా వీరి చిట్టాలో ఉంది. ఈ కూటమి ఏర్పాటు సాధ్యమైతే నిధులు, హక్కుల కోసం బలంగా పోరాడవచ్చనేది బాబు, కేసీఆర్ ల యోచన. అయితే ప్రస్తుతమున్న రాజకీయవాతావరణంలో స్వతంత్రంగానే బేరసారాలు చేసుకునేందుకు పార్టీలు మొగ్గు చూపుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related Posts