YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నటభూషణం... విలనిజానికి భూషణం నాగభూషణం

నటభూషణం... విలనిజానికి భూషణం నాగభూషణం

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది... గాంధీ పార్కు అని పెట్టారు రామా...
కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా.. అంటూ డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారు మోగేవి.
బందరులో ప్రదర్శన జరుగుతోంది... ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా.. అనడగుతుంది.
బ్రహ్మానందరెడ్డిని కులం అడిగినట్టుంది రామా.. చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా.. అంటాడు.
ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే.. ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో జొప్పిస్తూ...
చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరూ తెలియదు కానీ
రక్తకన్నీరు అనడం ఆలస్యం...నాగభూషణం కదూ అని టక్కున గుర్తుపట్టేస్తారు.
జయంతి నాడు ఓ సారి ఆయన్ను తలుచుకుంటే ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో అవగతమవుతుంది.
విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. చుండి నాగభూషణం పూర్తి పేరు. ఏప్రిల్ 19న నెల్లూరులో జననం.. ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు.... ఆర్ధిక లోపం కారణంగా... వెనకడుగు. దాంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు సెంట్రల్ కమర్షియల్ సూపరిడెంట్ కార్యాలయంలో ఉద్యోగం. నెలకు పాతిక రూపాయల జీతం- మద్రాసుకు మారిన మకాం. 1941లో సుబ్బరత్నంతో వివాహం... ఆమె అకాల మరణంతో శశిరేఖను మారు వివాహం. ముగ్గురు కుమారులు-ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇవీ సినీ- నాటకేతరంగా ఆయనకు చెందిన విశేషాలు. ఆయన నటజీవిత విశేషాల గురించి ఎంత క్లుప్తంగా చెప్పుకున్నా.. ఓ అరగంట టైం తీసుకుంటుంది.

*ఓ విలనుండాలి*

కథను హీరో నడిపిస్తుంటే.. ఆ హీరోను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి ఓ విలనుండాలి. అందులో ఆరితేరినవాడు నాగభూషణం. నాగభూషణం ఫ్రం నాటకం. ఆ కాలంలో అందరిలాగే ఆయన తొలుత స్టేజీ ఎక్కి.. అందరి నటుల్లాగానే చప్పట్లనే జీతభత్యాలుగా భావించి.. వాటికి మైమరచిన నటుడు. ఆ తరువాత వెండితెరకు ప్రవేశించి ప్రసన్నం చేసాడు. నాగభూషణం అంటే సమర్ధవంతమైన ప్రతినాయకులనగానే టక్కున గుర్తుకు వచ్చే నటుడు. ఎంత చిన్నా చితకా వేషాలిచ్చినా... తనదైన స్టైల్ తో ఒప్పించి- మెప్పించి చూపుతాడు నాగభూషణం.

*నేర్పరి*

కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెరరూపం నాగభూషణం. హీరో విరుచుకు పడటానికి వచ్చినప్పుడు అతనికి కావల్సినదేదో ఇచ్చి పంపేసి.. ఆనక ఇరకాటంలో పడవేయడంలో నేర్పరి నాగభూషణం. అల్లు రామలింగయ్యలాంటి సహాయకులు అయ్యా తమరు పొడుం మార్చాలి అంటే ఎందుకూ... వాడ్ని జైలుకు పంపే తాళం ఇక్కడుంటేనూ... అంటూ తాను వేసిన ఎత్తుకు పై ఎత్తును ఎత్తి చూపే వైనం... అబ్బబ్బో సీన్ లోకి ఎంటరయ్యి చూస్తే తప్ప అనుభవైకవేద్యం అవదు.

*విలన్లు లేక కాదు..*

వాస్తవానికి ఆయన సినిమాలకొచ్చిన కాలానికి విలన్లు లేరని కాదు... ఎస్వీఆర్ ప్రతినాయక పాత్రల్లో అద్భుత నటనే కనబర్చారు. కానట్లైతే చాలా చాలా తక్కువ సినిమాల్లో. ఇక ఆర్. నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కూడా వున్నారు. వారంతా కథానాయకులతో కుస్తీలు పట్టి, కత్తియుద్ధాలు చేసి బలపరాక్రమాలు చూపే విలన్లుగా పేరు తెచ్చుకున్నారు. నాగభూషణం వారికి విభిన్నం. మహాభక్తుడ్నంటూనే మాయచేసే మాయావిగా నాగభూషణం నాగభూషణమే అనిపించుకున్నాడు.
నటభూషణుడు-నాగభూషణం.

ఎలాంటి ఆవేశకావేశాలను పెద్దగా కురిపించకుండానే... సన్నివేశంలో కావలసినంత విలనిజం నింపగల చాతుర్యం ఆయన సొంతం. భక్తి- ముక్తి- రక్తి... కాదేది విలనిజానికనర్హం అన్నదే ధ్యేయంగా నటించిన నటభూషణుడు నాగభూషణం.

*చిరస్థాయిగా*

మద్రాసు చేరే దాకా... ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలియదు. ఆయనలోని నటుడ్ని మేల్కొల్పిన వారు జీ. వరలక్ష్మి, మిక్కిలినేని. చిన్నప్పటి నుంచీ వామపక్షభావజాలానికి ఆకర్షితుడవుతూ వచ్చాడు నాగభూషణం. ప్రజానాట్యమండలి... ఆ ఇద్దరితో పరిచయానికి ప్రాణం పోసింది. వారితో కలిసి ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో విరివిగా పాల్గొనే వాడాయన. అలా నాగభూషణం-నటజీవితానికి బీజం పడింది. దాని ఫలితం ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

*మలుపు తిప్పిన మద్రాస్*

నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది మద్రాసే. ఇందులో నో డౌట్. నాగభూషణం... మద్రాసు వెళ్లడం... వరలక్ష్మి తదితరులతో... పరిచయాలు వగైరాలు అలా వుంచితే... అక్కడి నాటకాలు విశేషం ప్రభావాన్ని చూపాయి. ఆయనలోని నిజమైన నటుడ్ని వెలికి తీసింది మద్రాస్ నాటక రంగమే. ఆనాటికే ఎమ్మార్ రాధా, మనోహర్ వంటి ప్రయోక్తలు తమిళనాటకాలను భారీ సెట్టింగులతో దుమ్ము రేపేవాళ్లు. అదే నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది. వారాడిన రక్తకన్నీర్ నాటకం.. ఆనాడు పెద్ద స్టేజ్ ప్లే సెన్సేషన్. దాన్ని తెలుగునాట చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన నాగభూషణం జీవితంలో ఓ మలుపు. సుమారు 5వేలా 500ల ప్రదర్శనలు చేసింది రక్తకన్నీరు. ఆఖరుకు అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ వూపు సినిమా తీరాలకు చేర్చిందాయన్ను. అక్కడి నుంచి నాగభూషణం... ప్రతినాయక పాత్రకు నిజంగానే భూషణంగా మారాడు. తెరమీద కొంపలు ముంచుతూనే నవ్వే నవ్వు నిన్న మొన్న చంద్రబాబుకు కూడా అలా గుర్తుండి పోయింది. ఎప్పుడైనా దివంగత వైఎస్ నవ్వితే... అది నాగభూషణం నవ్వులా వుందని అనేవారయన. అదీ నాగభూషణం అంటే...
కావాలనుకున్నాడు అయ్యాడు!!

పీపుల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు సినిమాలో నాగభూషణం చిన్న వేషం వేసాడు. ఆ తరువాత పెంకిపెళ్లాంలో వేసిన తాగుబోతు వేషం, అమరసందేశంలో వేసిన విలన్ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చాయి. సినిమాల్లో వేషాలు వేస్తున్నా నాటకాలను వదిలేవారు కారాయన. అలాగే హీరోకావాలన్న కాంక్ష కూడా... మనసులో బలంగా వుండేది. 1957లో వచ్చిన ఏదినిజం... సినిమాలో ఎట్టకేలకు కథానాయకుడయ్యాడు నాగభూషణం. ఆ సినిమాకు అన్నీ తానై చేశాడు నాగభూషణం. సినిమా బాగానే ఆడింది. రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. అయినా తగిన గుర్తింపు శూన్యం. హీరో కావాలనుకున్నాడు అయ్యాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడం విచిత్రంగా అనిపించింది. నాగభూషణం హీరో అయిపోయి వుంటే... విలనిజానికి భూషణంగా మారేదెవరు. అందుకే కావచ్చు హీరో వేషం వెంబడి హీరో వేషం నాగభూషణం దరిచేరలేదు. సొంత వూరి వాళ్ళు తీసిన సినిమాతో హీరో వేషానికి కాస్త కామా పడ్డట్టైంది.

*ద్వారాలు బార్లా*

కొన్నాళ్ల పాటు హీరో వేషాలు కాదు కదా... అసలు సాదా సీదా వేషాలకే అడ్డంకి ఏర్పడింది. హీరో వేషం వేసినవాడు మామూలు వేషాలు వేస్తాడా.. అన్న అనుమానంలో పడింది అప్పటి ఇండస్ట్రీ. 1960లో సుందర్ లాల్ నహతా, డూండీలు శభాష్ రాజా సినిమా తీస్తూ నాగభూషణానికి మంచి వేషం ఇచ్చారు. అంతే.. దశ తిరిగింది. మళ్ళీ నటరాజు కరుణించాడు. నాగభూషణుడి తెరతాండవానికి ద్వారాలు బార్లా తెరుచుకున్నాయి.

*సరసానికి పనికిరారు*

'ఈ ఫ్యామిలీ గాళ్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారు'. ఇదీ ఆదుర్తి సుబ్బారావు తీసిన మంచిమనసులు చిత్రంలోని డైలాగ్. ఎమ్మార్ రాధాకు, నాగభూషణానికి... ఏదో అవినాభావసంబంధం ఉంది కాబోలు. అది రక్తకన్నీర్ వొరవడి కావచ్చు.. తమిళంలో రాధా వేసిన కర్పగం వేషం తెలుగులో నాగభూషణం వేసాడు. ఎంత జులాయి వేషమది. ఈ ధూర్తుడు గిరీశం తమ్ముడు కాడు కదా... అనిపిస్తుంది. ఇందులో ఆత్రేయగారి కలానికీ.... నాగభూషణం డైలాగ్ డెలివరీకి మధ్య రసవత్తరమైన పోటీ సాగింది. చాలా డైలాగులు బ్రహ్మాండంగా పేలాయి.

*ప్రత్యేక స్థానం*

ఆ మరుసటి ఏడాది వచ్చిన మూగమనసులు సినిమా నాగభూషణానికి వెండితెరమీద ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసింది. ఎన్టీరామారావుకు ఆయనంటే అభిమానం ఉండేది. తన స్వంత సినిమాలు ఉమ్మడికుటుంబం, వరకట్నం, తల్లాపెళ్లామా, కోడలుదిద్దిన కాపురం, ఇలా అన్నింటిలోనూ ఆయనకు వరుస వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో ఆయన సూర్యకాంతానికి జంటగా వేసిన ముసలి వేషంలో సైతం నాగభూషణం ప్రేక్షకజనానికి కితకితలు పెట్టాడు. బాపు- రమణల బాలరాజుకథలోని పనిగండం మల్లయ్య పాత్ర తెలుగుప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. నాగభూషణం నటన గురించి చెప్పుకోడానికి ఇదీ అదని ఒక సినిమా కాదు ఆయన నటించిన ఏ సినిమా తీసుకున్నా... నాగభూషణం ఓ నటభూషణమై మెరుస్తాడు.

*డొక్కల్లో పొడుస్తా*

మొన్నామధ్య బ్రహ్మానందం వేసిన తల్లికొడుకుల వేషం నేటి ప్రేక్షకులకు విదితమే. అంతకన్నా ముందే నాగభూషణం... ఈ ఫీట్ చేసి నిజంగా నటభూషణుడే అనిపించాడు. నేనంటే నేనేలో తనకు తాను తల్లివేషం వేసి... డొక్కల్లో పొడుస్తానంటూ అట్లకాడతో బెదిరిస్తూ బెంబేలెత్తిస్తాడు. కథానాయకుడు సినిమా నాగభూషణానికి స్టార్ హోదా తెచ్చిపెట్టింది. ఇందులో ముళ్ళపూడి రాసిన కథకు భమిడిపాటి రాసిన మాటలు తూటాల్లా పేలాయి. విలన్ డైలాగులకు సైతం చప్పట్లు కొట్టడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలిచింది.

*సినిమాలకు భూషణంగా*

కథానాయకుడు వచ్చిన ఏడాదిలోనే రిలీజైన బుద్ధిమంతుడు సినిమా ఆయన్ను మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇందులో నాగభూషణం చేసిన విలనిజం... చెప్పేదేముందీ అదరహో అనిపించింది. రోజు రోజుకీ... ప్రతినాయకత్వానికి వంక పెట్టడానికి వీలు లేనంతగా ఎదిగిపోయాడు.... నాగభూషణం. రాను రాను ఆయన నటించిన సినిమాలకు భూషణంగా మారడం ఎక్కువైంది. స్టార్ హోదా ఆయన్ను మళ్లీ విలనిజం నుంచి హీరోయిజానికి మళ్లమని రెచ్చగొట్టింది.

*సినిమాలకు భూషణంగా*

మళ్లీ ఎందుకు హీరో కాకూడదు... అన్న ఆలోచన నాటకాలరాయుడు సినిమాకు జీవం పోసింది. మరోమారు తనలోని కథానాయకత్వానికి పదును పెట్టాడాయన. హిందీలో భగవాన్ హీరోగా వచ్చిన అల్ బేలా దీనికి మాతృక. నాటకాలరాయుడు పేరుకు తగ్గట్టుగానే నాగభూషణంలోని హీరో కోరికతో నాటకం ఆడి పోయింది. దిడ్డి శ్రీహరిరావుతో కలసి తీసిన ఈ సినిమా ఆడలేదు. మళ్లీ చేతులు కాలాయి. కానీ, నాగభూషణంలోని తృష్ణకు సినిమా అద్దం పట్టిందనే చెప్పవచ్చు. ప్రతి నటుడి జీవన చిత్రమిదే చూడమందీ చిత్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకూ క్రియేటివ్ పీపుల్ మీద తీసిన సినిమాలేవీ ఆడలేదు. జనం ఇక్కడ నిజంగానే స్వార్ధం చూపిస్తారేమో తెలియదు. మా గురించి తీయండీ చూస్తాం. మీ గురించి మీరు తీసుకుంటే మాకెందుకూ... అన్న చందం అనుసరిస్తారు కాబోలు ప్రేక్షకులు. నాటకాలరాయుడు.. ఈ మధ్య కాలంలో వచ్చిన అప్పల్రాజు, నేనింతే సినిమాలు కూడా ఒకే ఫలితాలను చవిచూడ్డాన్ని బట్టీ అర్ధమయ్యే విషయమిదే అనిపిస్తుంది.

*మళ్లీ కథానాయకత్వం మీద*

ఆ తరువాత ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం రీత్యా ఒకే కుటుంబం సినిమా తీసాడు నాగభూషణం. అది విజయం సాధించింది. బయట నిర్మాతలు చో రామస్వామి సూపర్ హిట్ తమిళనాటకం మహమద్ బిన్ తుగ్లక్ తెలుగు సినిమాగా తీసారు. దాసరినారాయణరావు వచనసారధ్యం వహించిన ఈ చిత్రం బాగానే ఆడింది. నాటకాలరాయుడుతో హీరోఆశ అంతరించి పోవడం వల్ల కావచ్చు... మళ్లీ కథానాయకత్వం మీద దృష్టి నిలపలేదాయన. అయితే తన ఇమేజ్ ని రంగరించి ఓ పొలిటికల్ సినిమా తీయాలన్న కోరిక మాత్రం గాఢంగా వుండేది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన సమత నవలను ప్రజానాయకుడు పేరుతో సినిమాగా తీసాడు. అది అనేక సెన్సార్ కట్లకు గురికావడంతో పాత సెంటిమెంటే రిపీటయ్యింది. సరిగ్గా ఆడలేదా చిత్రం. ఆనక భాగస్తులు వంటి ఒకటి రెండు సినిమాలు తీసినా... అవి పెద్దగా విజయం సాధించలేదు.

*విలనీకి గట్టి పోటీ*

1974లో వచ్చిన ముత్యాలముగ్గు నాగభూషణం విలనిజానికి బ్రేకులు వేసిందని చెప్పాలి. అదేంటి ఆ సినిమాలో విలన్ అలో అలో రావుగారు కదా... అంటారు కావచ్చు. ఆ అలో అలో రావు గోపాలరావుగారి వెరైటీ విలనీ.. అప్పటి వరకూ వున్న నాగభూషణం విలనీకి గట్టి పోటీనిచ్చింది. నైటుకు- నైటు స్టారయిన రావుగోపాలరావు... నాగభూషణాన్ని వెనక్కు నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన అడవి రాముడులో చరిత్ర అడక్కు చెప్పింది చెయ్.. వంటి డైలాగులతో మాంచి ఊపు మీదున్నట్టు అనిపించినా... వర్కవుట్ అవలేదు. కృష్ణ నటించిన నెంబర్ వన్ ఆయన ఆఖరు సినిమా.

*నిజజీవితంలో కథానాయకుడే*

సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో సలహాసంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వుంది. ఎన్ని సినిమాలు చేసినా... నాగభూషణం రక్తకన్నీరు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ... ఆ 25ఏళ్ల పాటూ మూడు వందల మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెరమీద హీరో వేషాల్లో అడుగడుక్కీ విఫలమవుతూ... ఎంత విలన్ గా రాణిస్తూ వచ్చినా... నిజజీవితంలో ఆయన కథానాయకుడే అని చెప్పడానికి ఇదొక్కటి చాలు.

Related Posts