YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ బెట్టింగ్ పై హాట్ ఫేవరేట్

లోకేష్ బెట్టింగ్ పై హాట్ ఫేవరేట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

'బెట్‌కు ముందుకు రండి’ అంటూ సాక్షాత్తు ఓ టీడీపీ నాయకుడు సవాల్‌ విసరడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం లోకేష్‌కోసం మాత్రమే ఈ ఎన్నికల్లో పని చేసిన ఆ నాయకుడి సవాల్‌ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అన్నీ తానై వ్యవహరించడమే కాక ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన ఆ నాయకుడే లోకేష్‌ ఓటమి తప్పదని బెట్టింగ్‌ కట్టడం చూస్తుంటే.. ఇప్పటికే లోకేష్‌ను నమ్మి బెట్టింగ్‌లు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బూత్‌ల వారీగా నివేదికలు తెప్పించుకున్న సదరు నాయకుడు లోకేష్‌ ఓటమి ఖాయమని, బెట్టింగ్‌లు కట్టి నష్టపోవద్దని అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే లోకేష్‌ గెలుస్తాడని ఎవరైనా బెట్టింగ్‌లు కట్టివుంటే ఆ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు లోకేష్‌ ఓటమిపై బెట్టింగ్‌ కట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. వాస్తవానికి లోకేష్‌ను గెలిపించేందుకు సదరు నేత పక్కా ప్రణాళిక రచించాడు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ బరిలో నిలవడంతో ఆ నేతతో పాటు ఇతర టీడీపీ నాయకులు ఎలాగైనా లోకేష్‌ను గెలిపించేందుకు కోట్ల రూపాయల డబ్బును మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సదరు నేతతో పాటు ఆయన శిష్యుడిగా ఉన్న మరో యువనేత వారి సొంత డబ్బును కూడా వెచ్చించినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతలు ఖర్చు పెట్టిన డబ్బులను ఎన్నికలు జరక్కముందే తిరిగి వెనకేసుకునేందుకు పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కట్టినట్లు సమాచారం. అయితే పోలింగ్‌ అనంతరం బూత్‌ల వారీగా సమీక్షించి పరిస్థితి తారుమారైందనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా పోలింగ్‌ జరిగిన విధానాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ వాస్తవ పరిస్థితిని పార్టీ పెద్దలకు ఏ విధంగా వివరించాలో అర్థం కాక తర్జనభర్జనలు పడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలే లోకేష్‌ ఓటమిపై బెట్టింగ్‌లకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 

Related Posts