యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చివరి నిమిషంలో మార్పులు తెలుగుదేశ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అభ్యర్థులు పోలింగ్ సమయంలో చేతులెత్తేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళుతుంటే, టీడీపీ మాత్రం పోలింగ్ కు ముందే చతికలపడిపోయిందన్న టాక్ ఈ నియోజకవర్గంలో విన్పిస్తుంది. నిజానికి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మలిచారు మంత్రి శిద్ధారాఘవరావు. ఆయనే తిరిగి పోటీకి దిగి ఉంటే ఫలితం వేరేలా ఉండేదంటున్నారు. శిద్ధాను ఎంపీ అభ్యర్థిగా పంపి, కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శి నియోజకవర్గంలో పోటీ చేయడంతోనే తంటా వచ్చిందంటున్నారు.ఐదేళ్లుగా దర్శి నియోజకవర్గంలో శిద్ధారాఘవరావు పార్టీని నిలబెట్టారనే చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడంలో శిద్ధా సక్సెస్ అయ్యారు. దర్శి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే బాగుంటుందని పార్టీలు కూడా అభిప్రాయపడతాయి. కానీ శిద్ధాకు మాత్రం మినహాయింపు ఉంది. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబూరావు టీడీపీ నుంచి పోటీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయిందని టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేశారు. ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి బూచేపల్లి కుటుంబం చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి మద్దిశెట్టి ఆ తప్పు చేయలేదు. గతంలో ప్రజారాజ్యంలో తనకు అండగా నిలిచిన వారందరినీ తన వైపునకు తిప్పుకోగలిగారు. అంతేకాకుండా తాను పోటీ చేయనని చెప్పిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని తన ప్రచారంలో బాగా వాడుకున్నారు. బూచేపల్లికి ఇప్పటికీ గ్రామగ్రామన క్యాడర్ ఉంది. వీరిందరినీ ఏకతాటిపైకి తెచ్చి వైసీపీ వైపు మరల్చగలిగారు మద్దిశెట్టి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేశారు.కాపు సామాజిక వర్గంలో అధికభాగాన్ని తనవైపునకు తిప్పుకున్న మద్దిశెట్టి వేణుగోపాల్ కమ్మ సామాజికవర్గంలోని ప్రధాన నేతలను తన దారికి తెచ్చుకోగలిగారు. ఇలా అడుగడుగునా దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ దే పై చేయి కన్పించింది. బూచేపల్లి కూడా చేతులు కలపడంతో విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు మాత్రం ఓటమిని ముందే అంగీకరించారంటున్నారు తెలుగుతమ్ముళ్లు. పెద్దగా ఖర్చుచేయలేదని కూడా ఆ పార్టీ నేతలే చెబుతుండటం విశేషం. మొత్తం మీద దర్శి నియోజకవర్గంలో వైసీపీకి పూర్తిగా విజయావకాశాలున్నాయంటున్నారు.