బొబ్బిలి: జిల్లాలో నీరు-చెట్టు పనులు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు కాకపోవడంతో వారు ముందుకు రాక ఆయా వాటి జోలికి అధికారులు వెళ్లలేకపోయారు. రానున్న ఖరీఫ్‌నకు కూడా ఈపనులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. నిధులు రావన్న ఉద్దేశంతో ఎవరూ వాటి జోలికి పోవడం లేదు. జిల్లాలో చిన్న, మధ్య తరహా సాగునీటి పథకాల పరిధిలో కీలక పనులు నీరు-చెట్టులో పూర్తిచేయాలని అధికారులు రెండేళ్ల కిందట ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు ప్రత్యేకంగా ఎస్‌ఈ స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణకు నియమించారు. అయినప్పటికీ ఇవి ముందుకు వెళ్లలేదు. ఈ కారణంగా అనుకున్న ఆశయం నెరవేరలేదు.
జిల్లాలోని చిన్న, మధ్యతరహా సాగునీటి పథకాల పరిధిలో 200 రకాల పనులు అధికారులు గుర్తించారు. దీనికి సాంకేతికపరమైన ఆమోదం కూడా పొందారు. ముఖ్యంగా జలాశయాల పరిధిలోనే ఎక్కువ పనులు ఉన్నాయి. ఇందులో 40 శాతం కూడా పనులు చేయలేకపోయారు. కేవలం రూ.20 కోట్ల పనులు మాత్రమే జరిగినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. చేసిన పనులకు రూ.10 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఏడాదిగా చేసిన పనులకు మొత్తాలు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. అధికారులు కూడా చేసేది లేక చేతులెత్తేశారు. ఉన్న పనులను ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అమరావతిలో రెండు రోజులుగా ఇంజినీర్లతో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బిల్లులు ఇస్తే తప్ప ముందుకు తీసుకువెళ్లలేమని ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు కూడా డైలమాలో పడ్డారు. ఒక్కో సర్కిల్ పరిధిలో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
కీలక పనులే ఉంచేశారు: కీలక పనులే నిలిచిపోయాయి. జలాశయాల పరిధిలో షట్టర్ల మరమ్మతులు, తూముల నిర్మాణం, షట్టర్ల అమరిక, లైనింగు పనుల నిర్మాణం వంటివి చేపట్టాల్సి ఉంది. జలాశయాల పరిధిలో ఇవి జరగలేదు. ఈ పనులు సాగునీటి సంఘాలు, జన్మభూమి కమిటీలకు అప్పగించారు. బిల్లులు జాప్యమవుతున్నాయన్న ఉద్దేశంతో వారు చేసేందుకు ముందుకు రాలేదు. కొన్నిచోట్ల టెండర్లు పద్ధతిన పనులు చేపట్టినా గుత్తేదార్లు కూడా పూర్తి చేయలేకపోయారు. రానున్న ఖరీఫ్‌లో పంటపొలాలకు సాగునీరు వెళ్లాలంటే ఈసీజన్‌లోనే పనులు జరగాలి. ఇంతవరకు అధికారులు ఆ జోలికి పోలేదు. నీరు-చెట్టు తప్ప ఇతర నిధులు లేకపోవడంతో ఏ పనులు కూడా ముందుకు వెళ్లడంలేదు. ఈప్రభావం రానున్న ఖరీఫ్‌పై చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమీక్షా సమావేశాలే తప్ప కీలక పనులు పూర్తికావడం లేదు. పెండింగ్ బిల్లులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులు నివేదిస్తున్నా కదలిక రావడం లేదు. చెక్‌డ్యాంల పరిస్థితి కూడా అలానే ఉంది. సర్కిల్ పరిధిలోని సుమారు 100 చెక్‌డ్యాంలు నిర్మించాలని తొలుత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్లాలని అనుకున్నా క్షేత్రస్థాయిలో వాటికి కదలిక లేదు. వృథా నీటికి కళ్లెం వేసేవిధంగా చెక్‌డ్యాంలను నిర్మించాలనుకున్నా బిల్లుల జాప్యం కారణంగా ఈ పనులు కూడా ముందుకు కదలలేదు.