యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
బెంగళూరు కథ ముగిసినట్లే. ఆదివారం దిల్లీతో మ్యాచ్లో ఆ జట్టు 16 పరుగుల తేడాతో ఓడింది. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే దాంట్లో గెలిచి.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న కోహ్లిసేన కీలక మ్యాచ్లో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50; 37 బంతుల్లో 5×4, 2×6), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (52; 37 బంతుల్లో 2×4, 3×6) అర్ధసెంచరీలతో సత్తాచాటారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ (2/41) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో పార్థివ్ పటేల్ (39), స్టాయినిస్ (32 నాటౌట్) రాణించారు. రబాడ (2/31), అమిత్ మిశ్రా (2/29) ప్రత్యర్థిని కట్టడి చేశారు.