యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బంగాళఖాతంలో ఫణి తుపాను ప్రభావం కొనసాగుతోంది. క్రమంగా బలపడి ఏడు కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఫణి తుపాను బలపడి, తమిళనాడు, కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో తుపాను కేంద్రీకృతం అవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 30 నుంచి మే 1వరకూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తుపాను ప్రభావంతో ఈ నెల 29, 30వ తేదీల్లో తమిళనాడు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 2న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్య్సకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.