యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేని పరిస్థితి ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ప్రధానంగా పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని భావించినప్పటికీ.. ఎన్నికల పోలింగ్‌లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించినప్పటికీ ప్రత్యామ్నాయ పార్టీగా అరంగేట్రం చేసిన జనసేన కూడా ఇదే రేంజ్‌లో దూకుడు ప్రదర్శించింది. ఈ రెండు పార్టీలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసింది. చాలా నియో జకవర్గా ల్లో అధికార టీడీపీకి ఎఫెక్ట్ వచ్చేలా ఈ పార్టీ వ్యవహరించింది. జనసేన నుంచి పోటీ చేసిన నేతలు గెలుస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రధాన పార్టీల ఓట్లను మాత్రం చీల్చడంలో ఈ పార్టీ విజయం సాధించింది.పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఓట్లు చీల్చి టీడీపీ, వైసీపీలను దెబ్బకొట్టింది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోనూ జనసేన తన సత్తా చాటింది. ఇక్కడ కూడా ఓట్ల చీలికలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ టీడీపీ నుంచి బండారు మాధవనాయుడు పోటీకి దిగారు. ఈయన గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి 21 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అది కూడా వాస్తవానికి బండారు మాధవనాయుడు రాజకీయంగా జూనియర్. అయినా కూడా వైసీపీ నుంచి రాజకీయ దురంధరుడిగా ఉండి పోటీచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడిపై విజయం సాధించి రికార్డు సృష్టించాడు. నిజానికి కొత్తపల్లి రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే ప్రారంభమైనా.. తర్వాత ఆయన ప్రజారాజ్యం.. అటు నుంచి కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీల్లోకి చేరింది.గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మళ్లీ పుట్టిల్లు టీడీపీలోకి వచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో వెంటనే పార్టీ మారి వైసీపీకి జై కొట్టారు. అంతేకాదు, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇక, వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజు, జనసేన నుంచి బీసీ వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ఇక్కడ తాజా ఎన్నికల్లో తలపడ్డారు. నియోజకవర్గంలో కాపుల ప్రభావం ఎక్కువ. పైగా మెగా ఫ్యామిలీ స్వగ్రామం మొగల్తూరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది.ఇక్కడ కాపుల ఓట్లు టీడీపీకి పడతాయని భావించినా కొత్తపల్లి వైసీపీలోకి చేరడంతో ఆయన ప్రభావంతో కాపులు కొందరు జనసేనకు, మరికొందరు వైసీపీకి వేసినట్టు తెలిసింది. దీంతో టీడీపీకి ఇబ్బంది కర పరిణామాలు ఎదురయ్యాయని అంటున్నారు. టీడీపీ ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు దక్కించుకోవడంలో మూడో ప్లేస్‌లోనే ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువగా ఓటింగ్ ఉన్న నరసాపురం పట్టణంలో టీడీపీ మూడో ప్లేస్‌కు పడిపోయిందని టీడీపీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. ఇక బీసీల్లో పట్టు ఉన్నా జనసేన వ్యూహాత్మకంగా బీసీ వర్గానికి సీటు ఇవ్వడంతో బీసీల ఓట్లు కూడా ఎక్కువుగా జనసేనకు పడడం టీడీపీకి ఇక్కడ పెద్ద మైనస్. ఓవరాల్‌గా నరసాపురంలో టీడీపీకి థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంటుందా ? లేదా ఇంకా గొప్ప ప్రదర్శన చేసి రెండో ప్లేస్‌కు వస్తుందా ? అన్న లెక్కలు మినహా ఇక్కడ ఆ పార్టీకి గెలుపుపై ఆశల్లేవన్నది ఆ పార్టీ వాళ్ల టాకే.