YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ

నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సేరమోర్ ప్రాంతంలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… టిఎంసికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి షాకిచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలు టిఎంసిని వదిలిపెట్టనున్నారని ఆయన ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరిపినట్లు మోడీ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక మే 23న ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఆ ఫలితాల్లో అన్ని చోట్ల కమలం గెలుపు ఖాయమని మోడీ జోస్యం చెప్పారు.రాజకీయాల్లో పరస్పరం రాళ్లు విసురుకోడమేగాని చమత్కారాల పూలు చల్లుకోడం అరుదు. నరేంద్ర మోడీని చోర్‌గా మారిన చౌకీదార్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎండగట్టినా నామ్‌ధారి అంటూ ఆయనపై ప్రధాని ప్రతి విమర్శ సంధించినా అవి ప్రధాన ఎన్నికల యుద్ధంలో భాగంగానే జరుగుతున్నాయి. కాని ఈసరళికి ఒకింత భిన్నంగా ప్రధాని మోడీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య సరికొత్త మాటల వార్ నడుస్తున్నది. మోడీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వూలో మమతా బెనర్జీ తనకు ప్రతియేటా తాను స్వయంగా ఎంపిక చేసిన కుర్తా (చొక్కా)లు, బెంగాల్ స్వీట్లు పంపిస్తారని పేర్కొనడం సరదాగా ఉందనిపించింది. ఏడాదికి రెండు మూడు సార్లు ఆమె వీటిని పంపిస్తారని కూడా ఆయన అన్నారు. దీనికి ఆమె సమాధానమిస్తూ అదేమీ ప్రత్యేక విషయం కాదని దానిని ప్రధాని ప్రస్తావించడం సబబుగా లేదని అన్నారు. అందరికీ కానుకలు పంపించడం తనకు అలవాటని కూడా చెప్పారు.భీకరమైన ఎన్నికల సమరం మధ్య మిగతా ప్రతిపక్ష నేతలందరి కంటే అధికంగా తనపై సునిశితమైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్న మమతా బెనర్జీ అనవాయితీగా పంపే కానుకల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడం ఆశ్చర్యపరిచింది. దీని వెనుక గల రాజకీయమేమిటా అని కొంత మంది బుర్రలకు పదును పెట్టారు. లోక్‌సభలో బెంగాల్ నుంచి 42 మంది ఎంపిలుంటారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత తల ఎత్తే రాజకీయ సమీకరణల్లో అవసరమైతే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ సహాయాన్ని తీసుకొని తిరిగి అధికారంలోకి రావొచ్చనే ముందు చూపుతోనే ప్రధాని మోడీ ఆమె కానుకల గురించి ప్రస్తావించారనే అభిప్రాయం చక్కర్లు కొడుతున్నది. వాస్తవానికి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీకి ఆగర్భ శత్రువేమీ కాదు. 1999లో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో చేరారు. రైల్వే మంత్రిగా పని చేశారు. అటు పిమ్మట ఎన్‌డిఎ నుంచి వైదొలగి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశారుఆ తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుకు స్వస్తి చెప్పి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఆమె మళ్లీ ఎన్‌డిఎలో చేరే అవకాశాలు బొత్తిగా లేవుగాని రాజకీయాల్లో ఏదైనా సంభవమేననే అభిప్రాయాన్ని ఇటువంటి ఛలోక్తులు, చమత్కారాల ఘట్టాలు కలిగిస్తాయనేదే ఇక్కడ చెప్పుకోదగింది.నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాని పదవిని చేపట్టడానికి అందుబాటులోని అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్షాలు ఉద్యోగ కల్పన రంగంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని, పెద్దనోట్ల రద్దు ప్రహసనాన్ని, జిఎస్‌టి అమలు అవకతవకలను ప్రస్తావించి ప్రజా వ్యతిరేకిగా ఆయనను చిత్రిస్తున్నాయి. దానికి దీటైన జవాబుగా పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలను, సైన్యం పాత్రను పదేపదే ప్రస్తావిస్తూ తన హయాంలోనే జాతి భద్రంగా ఉంటుందని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. వారు దేనిని ఎంచుకొని ఓటు వేస్తున్నారనేదానిపై మోడీ మళ్లీ ప్రధాని కావడమో , ప్రతిపక్షాల సంకీర్ణం ఏర్పడడమో ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మోడీ కానుకల ప్రస్తావనకు మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. ఈసారి బెంగాల్ ప్రజలు ఆయనకు మట్టితో, గులకరాళ్లతో చేసిన రసగుల్లాలు పంపిస్తారు అని పంచ్ ఇచ్చారు. అంతకు ముందు మరో వ్యాఖ్య కూడా చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి పెద్ద రసగుల్లా (సున్నా) సాధిస్తుందని కూడా అన్నారు. ఇటువంటి హేయమైన వ్యాఖ్యలు చేసే ప్రధానిని ఇంతవరకు చూడలేదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. తాను గుండాగిరీ చేస్తున్నానన్న మోడీ వ్యాఖ్యకు కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియదని అన్నారు. ఇంత తీవ్ర వాగ్యుద్ధం సాగించిన మోడీ మమత మధ్య రాజకీయ సఖ్యత ఇంతలోనే కుదురుతుందని ఎవరూ ఊహించరు.వెలువడతున్న జోస్యాలను బట్టి ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పక్షాల ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రాగల సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి మాత్రం వేరే ఎక్కడా లేనంతగా ఎన్నికల యుద్ధం కేవలం మోడీ మమత మధ్యనే సాగుతున్నది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఖాయమైతే ప్రధానులు కాగల వారి జాబితాలో మమత బెనర్జీ కూడా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని విశాల ప్రతిపక్ష వేదికను నిర్మించడంలో ఆమె విజయవంతమయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి మాయావతి పేరు కూడా ప్రధాని పదవికి వినిపిస్తోంది. తాను బరిలో ఉండగలనని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఫలితాల లెక్కలను బట్టి ఎవరు ప్రధాని కాగలరన్నది స్పష్టపడుతుంది.

Related Posts