YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమలో ఆ స్థానాలపై వైసీపీ గెలుపు ధీమా

రాయలసీమలో  ఆ స్థానాలపై వైసీపీ గెలుపు  ధీమా

ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రోజుకో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక టీడీపీ, వైసీపీ పార్టీలు నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. అటు జనసేన సైతం... తాము అధికారంలోకి రాకున్నా.. ఎవరూ ఊహించనన్ని స్థానాలు మాత్రం గెలుస్తామని గట్టి విశ్వాసంతో ఉంది. ఐతే పోలింగ్ సరళిని విశ్లేషించిన రాజకీయ నిపుణులు ఈసారి జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సైతం తాము గెలవబోయే సీట్లపై లెక్కలు వేసుకుంటున్నారట. ముఖ్యంగా ఆ ఆరు జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమాగా ఉన్నారట.

రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలపైనే వైసీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ 6 జిల్లాల్లో కలిపి మొత్తం 74 స్థానాలున్నాయి. వీటిలో మూడింట రెండొంతుల సీట్లు సాధిస్తామని.. కనీసం 50 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారట వైసీపీ నేతలు.

కడప: వైసీపీకి కడప జిల్లా కంచుకోట. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉంది. కడపలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జగన్ చరిష్మాతో ఈ జిల్లాలో వైసీపీకి మెజారిటీ స్థానాలు రావడం ఖాయం. ఒకటి రెండు చోట్ల మాత్రం ఇతర పార్టీలు గెలవచ్చు.

కర్నూలు: జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో వైసీపీ 10 స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా కర్నూలులో ఖచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది.

చిత్తూరు: 14 సీట్లున్న చిత్తూరు జిల్లాలో 2014లో వైసీపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఐతే ఈసారి మరో రెండు సీట్లు అదనంగా వస్తాయని.. 10 సీట్ల వరకు వైసీపీ గెలుచుకుంటుందని విశ్వాసంతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.

అనంతపురం: గత ఎన్నికల్లో అనంతపురంలో కేవలం 2 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి జిల్లాల్లో వైసీపీ బాగా పుంజుకుందని... 10 సీట్లలో 8 సీట్లు గెలుస్తామంటున్నారు వైసీపీ నేతలు.

ప్రకాశం: జిల్లాలో మొత్తం 12 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో 6 సీట్లు గెలుచుకున్న వైసీపీ...ఈసారి మరో 2 సీట్లు అదనంగా గెలుస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ప్రకాశంలో 8 సీట్ల వరకు ఫ్యాన్ పార్టీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి.నెల్లూరు: 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్న నెల్లూరులో గత ఏడాది వైసీపీ 7 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మాత్రం క్లీన్ స్వీప్ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు. 10 కి 10 గెలచుకుంటామని స్పష్టంచేస్తున్నారు.

ఇలా మొత్తంగా ఈ 6 జిల్లాల నుంచి 50కి పైగా సీట్లు కచ్చితంగా వస్తాయని వైసీపీ భావిస్తోంది. వారి అంచనాలు నిజమైతే ఆ పార్టీకి అధికారం దక్కడం కష్టమేమీ కాదు. ఎందుకంటే ఏపీలో 88 సీట్లు సాధిస్తే అధికారంలోకి రావచ్చు. ఆరు జిల్లాల్లో వైసీపీకి 50 సీట్లు వస్తే...మిగిలిన 7 జిల్లాల్లో 38 సీట్లు సులభంగా గెలవచ్చని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. మరి వారి లెక్కలు నిజమై అధికారంలోకి వస్తారో లేదో తెలియాలంటే మే 23 వరకు వేచిచూడక తప్పదు.

Related Posts