యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎస్పీవై రెడ్డి... ప్రజలంతా ముద్దుగా పిలుచుకునేది పైపుల రెడ్డి. నంద్యాల ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిన నేతగా మూడు సార్లు ఎంపీగా హ్యాట్రిక్ విజయాలతో పాటు నంద్యాల మునిసిపల్ చైర్మన్ గా సేవలందించిన ఎస్పీవై రెడ్డి భౌతికకాయం నంద్యాల శివారులోని బొమ్మలసత్రంలోని ఆయన ఇంటికి చేరింది. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. నంద్యాల ప్రాంతంలో కరవు తాండవించిన వేళ, 'రొట్టె, పప్పు' కేంద్రాలను తెరిచి కేవలం రెండు రూపాయలకే లక్షల మంది ప్రజలకు ఆయన ఆహారాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు.
నంద్యాలలో జరిగిన ప్రతి అభివృద్ధి పని వెనుకా ఆయనున్నారని తలచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆయన స్థాపించిన సంస్థల్లోని ఉద్యోగుల కోసం ఏకంగా ఎస్పీవై రెడ్డి కాలనీ పేరిట భారీ ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేసి, ఉద్యోగులకు అత్యంత చౌకగా ఇంటి స్థలాలను అందించి, వారు ఇళ్లు కట్టుకునేందుకు సహకరించారు. నంది పైపులు, నంది డయిరీలతో పాటు ఆయన స్థాపించిన పాఠశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి తమ యజమానిని గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నంద్యాలలోనే జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు అధికారులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.