ఫణి తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. తితెలి తుఫాన్ గాయం మారక ముందే మరో ఉపద్రవం ఫణి రూపంలో కొట్టికి రావటంతో జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీరప్రాంత మండలాల్లో సీనియర్ అధికారులు మకాం వేశారు. జిల్లాలో కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగామ, మెలియపుట్టి, టెక్కలి, సంతబొమ్మాలి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు,ఎల్.ఎన్. పేట,సారవకోట, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, శ్రీకాకుళం, గార,ఎచ్చెర్ల, ఆమదాలవలస, పొందూరు మండలాల్లో అధికవర్షాలు కురవనున్నాయి. ఈ నెల 2,3 తేదీల్లో తీవ్రమైన ప్రభావం చూపించే దిశగా ఈ తుఫాన్ కనిపించనుందని వాతావరణ శాఖ సూచించింది. గంటకు 118నుండి 160 కిలోమీటర్లు వేగంతో ప్రచండ గాలులు వీచే పరిస్థితి కనిపిస్తుంది.