యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. అమరావతిలోని తన ఛాంబర్ లో నిన్న సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ అధికారులు గైర్హాజరు కాగా, ఈరోజు ఉద్యానవన శాఖ అధికారులు సైతం అదే బాటలో పయనించారు. ఈ రోజు ఏపీ ఉద్యానవన శాఖ పనితీరుపై సమీక్ష చేపట్టాలని మంత్రి సోమిరెడ్డి నిర్ణయించారు.ఇందులో భాగంగా సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్షా సమావేశానికి వెళితే ఏం ఇబ్బంది వస్తుందో అని భావించిన అధికారులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అధికారుల కోసం ఎదురుచూసిన సోమిరెడ్డి, చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఏపీ ప్రభుత్వం పట్ల ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తుపానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో కూడా ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదని అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి ఈసీ అనుమతినివ్వాలని చెప్పారు. కరవు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వం సమీక్షలు చేయవచ్చని అన్నారు. ఓ వైపు తుపాను ముంచుకొస్తున్న తరుణంలో, ఏం చేయాలో అధికారులకు అర్థం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం, ఈసీల్లో ఎవరి మాట వినాలో తోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. సాగు పద్ధతులపై రైతులకు దిశానిర్దేశం చేయాల్సి ఉందని... సమీక్ష నిర్వహించాల్సి ఉందని అన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం సాధారణ పాలన చేయవచ్చని చెప్పారు.