యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
వెన్నుపోటు’ కాన్సెప్ట్‌తో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ, ఓవర్సీస్‌లో విడులై ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ చిత్రం ఏపీలో మాత్రం రిలీజ్‌కు నోచుకోవడంలేదు. మే 1న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే, విజయవాడలో రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో సినిమా విడుదలపై కూడా అనుమానాలు తలెత్తాయి. అసలు ఈ సినిమాను ఏపీలో విడుదల చేయనిస్తారా? అని చాలా మంది ప్రశ్నించారు. అనుకున్నట్టే జరిగింది. ఈరోజు ఏపీలో ఏ థియేటర్‌లోనూ ఈ సినిమా ప్రదర్శించనివ్వలేదు. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని థియేటర్ల నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తగిలేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తరవాత, హైకోర్టు అనుమతి ఇచ్చాక కూడా శాంతి భద్రతల సమస్య ఇంకా ఎక్కడ ఉందని ఈ చర్యల వెనుకున్న శక్తులను నేను ప్రశ్నిస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు