యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్‌టీయూ షాకిచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడోవారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం వెబ్‌సైట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం బుధవారమే ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాల వెల్లడిని మూడు వారాలపాటు వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 2.67 లక్షల మంది అభ్యర్థులకు ఫలితాల కోసం మరికొన్ని రోజులపాటు నిరీక్షణ తప్పదు. ఇంటర్మీడియెట్ మార్కులు లేకపోవడంతో ఎంసెట్ ఫలితాల వెల్లడి సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఎంసెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డుకు సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో.. ఎంసెట్‌కు వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ స్పష్టత లేకపోవడంతో.. రిజర్వేషన్ల అమలు ఎలా అనే మీమాంసలో అధికారులు ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన వివాదం ఏపీ ఎంసెట్‌పై కూడా ప్రభావం చూపింది. తెలంగాణకు చెందిన దాదాపు 20 వేలమంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్ష రాశారు. దీంతో ఏపీ ఎంసెట్ రాసిన అభ్యర్థులకు ఎలా ర్యాంకులు కేటాయించాలో అధికారులకు అంతు చిక్కడం లేదు. ఇవన్నీ తేలాలంటే.. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఓ కొలిక్కి వచ్చి.. ఇంటర్ మార్కులు అందాకే ఏపీ ఎంసెట్ ర్యాంకులు వెల్లడించనున్నట్లు సమీక్ష అనంతరం అధికారులు తెలిపారు.