ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు ఉత్తరాంధ్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫణి తుపాను ఒడిశా సమీపంలో తీరం దాటవచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఫణి తుపాను ప్రభావం ఈ జిల్లాలపై తీవ్రంగా ఉండొచ్చనీ, కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. అలాగే అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో పాటు చెరువులు, కాలువల దగ్గర గండ్లు పడే అవకాశమున్న చోట ఇసుక బస్తాలను తరలించాలని ఆదేశించారు.మరోవైపు ఫణి తుపాను ఈ నెల 3న ఒడిశాలోని గోపాల్ పూర్-చాంద్ బలీ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.