రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో ఎంసెట్కు సంబంధించిన అంశాలపై ఉన్నత విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎంసెట్కు సంబంధించిన మెచిన్ ప్రోసెస్ విధానాన్ని వేగవంతంగా పూర్తి చేసి సకాలంలో అడ్మిషన్ల షెడ్యూల్ను ప్రకటించాలని ఆదేశించారు. ఇంటర్మీడియెట్లో గ్రేడింగ్ పాయింట్లు విధానాన్ని పూర్తిచేసేందుకు, ఇబిసి రిజర్వేషన్ల కోటాను నిర్ధారించేందుకు ఇంట ర్మీడియెట్, ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు కలిసి చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా, ఉన్నత విద్యామండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.