YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రాధ హృదయంలో మాధవుని పాద పద్మాలు!

రాధ హృదయంలో మాధవుని పాద పద్మాలు!

ఒకప్పుడు శ్రీకృష్ణుడు సపరివారంగా పవిత్ర స్నానం కోసం సిద్ధాశ్రయ క్షేత్రానికి వెళ్లగా అనుకోకుండా రాధా దేవి కూడా అక్కడికి వచ్చింది. ఈ అనుకోని కలయికకు ఇరువురూ ఎంతగానో ఆనందించారు. రుక్మిణి, జాంబవతి, సత్యభామాది అష్టపత్నులు ఎన్నో సార్లు స్వామి ముఖతః రాధ మహిమ విని ఉన్నందున వారందరూ సమయం చూసుకొని రాధతో ఏకాంతంగా మాట్లాడారు. అప్పుడు రాధ వారితో- ‘‘చంద్రుడొక్కడైనా చకోరాలు అనేకం. సూర్యుడు ఒక్కడే అయినా నేత్రాలు అనేకం. అలాగే బృందావన చంద్రుడైన శ్రీకృష్ణుడికి భక్తులు ఎందరో! నేను కూడా ఆ భక్త బృందంలో దానినే’’ అంది. ఈ మాటలు కృష్ణపత్నులను ఎంతో ప్రభావితం చేశాయి.

వారందరూ పట్టుబట్టి రాధను తామున్న చోటికి తీసుకువచ్చారు. ఎంతో మర్యాద చేశారు. తిరిగి వెళ్లే సమయంలో.. కృష్ణుడి పట్టమహిషి రుక్మిణిదేవి ఎంతో ఆప్యాయంగా ఆమెకు తాగడానికి పాలు ఇచ్చింది. పాలు తాగిన రాధ సంతోషంగా తన బసకు చేరుకుంది. ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు.. రోజూ మాదిరిగా రుక్మిణి పరమాత్మ పాదాలు ఒత్తడానికి ఉపక్రమించగా స్వామి పాదమూలాలు బొబ్బలు పడి ఉన్నాయి. వాటిని చూసి ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. కంగారుగా అంతఃపురంలో ఉన్న వారందరినీ పిలిచింది. అందరూ స్వామి పాదపద్మాలను చూసి విలపించసాగారు. కానీ ఒక్కరు కూడా స్వామిని కారణం అడిగి తెలుసుకొనే సాహసం చేయలేకపోయారు. చివరికి పరమాత్మే కళ్లు తెరిచి- వారి దుఃఖానికి కారణమేమని అడిగాడు. వారు స్వామివారి పాదాలపై బొబ్బలకు కారణమేమిటని అడిగారు.

పరమాత్మ ముందు మాట మార్చాడు. ఆ తర్వాత అందరూ బలవంతంగా చేయగా.. ‘‘రుక్మిణి! నీవు ప్రేమతో ఇచ్చిన వేడిపాలు రాధ అలాగే తాగేసింది. ఆమె హృదయంలో నిరంతరం నా పాద కమలాలు విరాజిల్లుతూ ఉంటాయి. ఆమె తాగిన పాల వేడికి నా పాదాలు కమిలిపోయి బొబ్బలెక్కడం సహజమేగా!’’ అన్నాడు. దీంతో రాధ ప్రేమ ముందు మన ప్రేమ ఎంత? అని అక్కడున్నవారందరూ సిగ్గు పడ్డారు. ఈ లీల ద్వారా కృష్ణుడు తన భార్యల మనసులో రాధ పట్ల ఉన్న ఈర్ష్యాసూయలను తుదముట్టించాడు. రాధనమనగా ఆరాధన. రాధ ఆరాధనా స్వరూపి ణి. భగవదారాధకులందరూ రాధ స్వరూపులే! మన హృదయాలలో నూ పరమాత్మ పాదారవిందాలు విరాజిల్లాలని స్వామిని ప్రార్థిద్ధాం.

 

Related Posts