యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి మరో మూడు వారాల గడువు ఉంటుండగానే జిల్లాల విభజనకు ఓ పార్టీ సిద్ధపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి అనుకూలురైన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఆ ఇద్దరు అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎన్ని జిల్లాలు పెంచొచ్చు, వాటికి జిల్లా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సర్వే జరుపుతున్నట్టు సమాచారం. సార్వత్రిక ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముందర జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టనుంది. జిల్లాల విభజన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ జిల్లాలను విభజించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే జిల్లాలు పెంచేందుకు మరో ఐదేళ్లపాటు ఆగాల్సి ఉంటుందని, దానివల్ల రాజకీయ పునరావాసాలు ఉండవన్న ఆలోచనలో ఆ పార్టీ అధినేత ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వారి అంచనా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా మరో 17 జిల్లాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉన్నందున ఆ సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ప్రధాని మోదీ ఉండగా, ఇక్కడ మాత్రం అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఓ రాజకీయ పార్టీ అధినేత సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నా.. ఆ పార్టీ అధినేత మాత్రం తానే కాబోయే ముఖ్యమంత్రినంటూ తనవారి కోటరీని ఏర్పాటు చేసుకొని పరిపాలన ఎలా సాగించాలన్న అంశంపై దృష్టిసారిస్తున్నట్టు సమాచారం.