YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అందరికీ వైద్యం

 అందరికీ వైద్యం

  కృష్ణాజిల్లా:

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక వసతులు కల్పిస్తుండగా తాజాగా ఉపకేంద్రాలను కూడా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతగా నియోజకవర్గంలో ఆరు కేంద్రాలను ఈ- ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలుగా ఎంపిక చేశారు.ప్రస్తుతం వాటిని ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి.
ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. సమయానికి వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడం, ఉన్నా అక్కడ వ్యాధి తగ్గదన్న అపోహలతో ఆ కేంద్రాలను ప్రజలు అంతంత మాత్రంగానే వినియోగించుకుంటున్నారు. చిన్నపాటి తలనొప్పి, జ్వరం లాంటి వాటికి కూడా చాలామంది ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆయా కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ఆరోగ్య ఉపకేంద్రాలుగా మార్చుతోంది. బందరు మండలంలో తాళ్లపాలెం, చిన్నాపురంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో పలు వసతులు కల్పించి మెరుగైన సేవలు అందించే క్రమంలో వెల్‌నెస్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పీహెచ్‌సీల పరిధిలో 11 ఉపకేంద్రాలు ఉన్నాయి.వీటిలో తాళ్లపాలెం పీహెచ్‌సీ పరిధిలో తాళ్లపాలెం ఉపకేంద్రంతో పాటు చిన్నాపురం పీహెచ్‌సీ పరిధిలో ఎస్‌ఎన్‌గొల్లపాలెం, గుండుపాలెం, చిన్నాపురం, పెదయాదర, కోన ఉపకేంద్రాలు తొలివిడతలో ఎంపికయ్యాయి. ఈ కేంద్రాలకు రంగులు వేసి ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.గోడలపై ఆసుపత్రిలో అందించే సేవలు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ధ తదితర అంశాలతో కూడిన చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎంపిక చేసిన కేంద్రాల వారీగా అన్ని వసతులు కల్పిస్తున్నారు. దీంతోపాటు అవసరమైన చోట అదనపు సిబ్బందిని కూడా నియమిస్తున్నారు. దీనిలో భాగంగా తాళ్లపాలెం కేంద్రానికి ఓ ఏఎన్‌ఎంను నియమించారు. ఇలా కేంద్రాలకు ఏమేమి అవసరమో అన్నీ సమకూర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయా ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటారు. వారి పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు వైద్యసేవలు అందించడంతోపాటు కేంద్రానికి వచ్చిన వారికి చికిత్సతోపాటు అవసరమైన మందులు ఇచ్చి పంపిస్తుంటారు. వైద్యుల అవసరం ఉంటే స్థానిక పీహెచ్‌సీకి సిఫార్స్‌ చేస్తుంటారు. ఇకపై వైద్యుని సలహాతో ఉపకేంద్రాల్లోనే అందించనున్నారు. వ్యక్తి రోగాన్ని బట్టి నిపుణులైన వైద్యుల సలహాతో అవసరమైన చికిత్స అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న వైద్యులు ఫోన్‌ ద్వారా రోగి సమస్యను తెలుసుకుని దానికి అనుగుణంగా అందించాల్సిన చికిత్సను కేంద్రంలోని సిబ్బందికి వివరిస్తారు. వారు ఇచ్చిన సూచనకు అనుగుణంగా ఇక్కడ సిబ్బంది చికిత్స అందిస్తారు. దానికి అవసరమైన పరికరాలను కూడా అధికారులు సమకూర్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ప్రతి కేంద్రానికి మందులు అందించే డ్రగ్‌వెండింగ్‌ యంత్రాన్ని అందిస్తున్నారు. ఈ యంత్రలో వివిధ రకాల మందులను నిల్వ చేసి ఆయా మందుల రకాలను బట్టి ఒక్కో దానికి ఓ సంఖ్య కేటాయిస్తారు. వైద్యులు ఫలానా సంఖ్య అని చెప్పగానే ఆ సంఖ్య ఉన్న బటన్‌ నొక్కితే మందులు వస్తాయి. ఆమందులను రోగికి అందిస్తారు. ఇలా అత్యాధునిక వసతులను సమకూర్చుతున్నారు. ఇలా తొలి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వసతులు కల్పించి రోగులకు సేవలు అందించడం ప్రారంభించి విడతల వారీగా మిగిలిన కేంద్రాలను తీర్చిదిద్దుతామని వైద్యులు చెబుతున్నారు. ఆయా విభాగాల నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఖరీదైన వైద్యాన్ని కూడా ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు అందరూ అవగాహనతో వినియోగించుకుంటే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.

 

Related Posts