యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన ఎంపీ స్థానం అమలాపురం. ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన ఈ సీటుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గత ఎన్నిక ల్లో ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై విజయం సాధించిన పండుల రవీంద్ర బాబు.. టీడీపీకి ఝలక్ ఇచ్చి.. వైసీపీలో చేరిపోయారు. కేంద్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న పండుల.. రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి.. వెంటనే ఎంపీ టికెట్ సంపాయించుకున్నారు. ఏపీ విభజన ఎఫెక్ట్, చంద్రబాబుపై సానుకూల పవనాల జోరులో గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇక, ఈ దఫా పండులకు నియోజకవర్గంలో ఎదురు గాలి బలంగా వీస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఆయనను మార్చాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిన సంద ర్భంలోనూ పండుల ఢిల్లీకి వెళ్లకుండా బాబుకు ఝలక్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఆయనను ఎన్నికల నుంచి తప్పించాలని నిర్ణయించారు.అయితే, ఈ విషయం ముందుగానే గ్రహించిన పండుల వెంటనే చంద్రబాబుకు కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే వైసీపీ జెండా తగిలించుకున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన అమలాపురం టికెట్‌ను ఆశించారు. అయితే, జగన్ కూడా ఆయనపై నిర్వహించిన సర్వేల్లో సరైన మార్కులు పడకపోవడంతో పండులకు టికెట్ ఇవ్వలేదు. కట్ చేస్తే.. ఇటు టీడీపీ గట్టి ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఎన్నికల ప్రకటనకు ముందు వరకు కూడా అసలు సోదిలోనే లేని మాజీ ఎంపీ, మాజీ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథూర్‌ను పొలిటికల్ తెరమీది కి తెచ్చారు చంద్రబాబు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన బాలయోగి అనేక రూపాల్లో అభివృద్ధి చేసి చూపించారు. కోనసీమను దేశానికి పరిచ యం చేశారని అనడంలో సందేహం కూడా లేదు. దీంతో బాలయోగికి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది.అయితే, ఆయన స్పీకర్‌గా ఉన్న సమయం లో అదే కోనసీమలో పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గంటి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ పెద్దగా రాజకీయాల్లోకి రాలేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రస్తుతం కీలకంగా మారిన ఎన్నికల్లో బాలయోగి ఫ్యామిలీ నుంచి ఆయన కుమా రుడిని రంగంలోకి దించడం ద్వారా ఒక ఎంపీ సీటును ఎన్నికలకు ముందుగానే తన ఖాతాలో వేసుకోవచ్చని భావించారు. అనుకున్నదే తడవు గా హరీష్‌ను పార్లమెంటుకు పోటీ చేయించారు. ఇక, ఇక్కడ వైసీపీ తరఫున చింతా అనురాధ, జనసేన తరఫున డీఎంఆర్ శేఖర్‌లు పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన చింతా అనూరాధ మాల మహానాడు నేత పీవీ.రావుకు స్వయానా మరదలు కావడం విశేషం.ఇక ప్రధాన పోటీ అనురాధ.. గంటి హరీష్‌ల మధ్యే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ముగిసిన ఎన్నికల తాలూకు ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. అయితే, గెలుపుపై మాత్రం టీడీపీ ధీమాగా ఉండడం గమనార్హం. ఇక్కడ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలోనూ గంటి ఫ్యామిలీ పట్ల ప్రజలు సానుభూతి చూపడం కనిపించింది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అమలాపురం, గన్నవరంలో వైసీపీకి ఎడ్జ్ ఉంది. మండపేట, రామచంద్రాపురంలో టీడీపీ దూకుడు చూపించింది. ముమ్మిడివరంలో మూడు పార్టీల మధ్య హోరీహోరీ పోరు కొనసాగింది. రాజోలులో జనసేన గెలుస్తామన్న ధీమాతో ఉంది. కొత్తపేటలో గెలుపుపై టీడీపీ, వైసీపీ రెండూ ధీమాతో ఉన్నాయి. ఇక ఎంపీకి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓట్ జరిగిందంటున్నారు. మరి ఎవరు ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కుతారో చూడాలి.