YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో హై లెట్ గా శిల్పా ఫ్యామలీ

కర్నూలులో హై లెట్ గా శిల్పా ఫ్యామలీ

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

శిల్పా కుటుంబం ఈసారి కర్నూలు జిల్లాలో హైలెట్ గా నిలిచింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న శిల్పా కుటుంబం నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం నుంచి ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అదృష్టం బాగుంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. శిల్పా కుటుంబ సభ్యులు పోటీ చేసిన రెండు చోట్ల గట్టి పోటీయే ఉంది. అయితే ఇద్దరూ తక్కువ మెజారిటీతోనైనా గెలుస్తారన్నది ఆ కుటుంబం లెక్కలు వేసుకుంటుంది.శ్రీశైలం నియోజకవర్గం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 4861 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఈసారి తెలుగుదేశంపార్టీ నుంచిపోటీ చేశారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలు ఇద్దరూ పార్టీలు మారి పోటీ చేస్తుండటంతో ఎవరిది గెలుపన్నది ఉత్కంఠగా మారింది. అయితే శిల్పా చక్రపాణిరెడ్డిపైన ఇక్కడ సానుకూలత కన్పిస్తోంది.శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీని వీడే ముందు, వైసీపీలో చేరే ముందు ఆరేళ్ల పదవీ కాలం ఉన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈవిషయంలో ఆయనకు కొంత ప్లస్ అయిందంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈనియోజకవర్గంలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలుండగా అన్ని చోట్లా వైసీపీ ఆధిక్యత కనబరుస్తుందన్న నమ్మకంతో శిల్పా కుటుంబం ఉంది. దీనికి తోడు టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి టిక్కెట్ కేటాయించిన తర్వాత తాను పోటీ చేయనని ప్రకటించడం కూడా ఇబ్బందిగా మారింది.కుటుంబంలో కుదిరిన ఒప్పంద మేరకు 2014 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తే, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి పోటీ చేయాలి.కానీ టీడీపీ అధిష్టానం రాజశేఖర్ రెడ్డికే కేటాయించడంతో కుటుంబంలో వచ్చిన కలతలకారణంగా ఆయన తొలుత పోటీకి విముఖత చూపారు. చివరకు చంద్రబాబు జోక్యంతో పోటీ చేశారు.ఇక నంద్యాల విషయానికొస్తే ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరుపున పోటీ చేశారు. పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో సాగిందంటున్నారు. ఉప ఎన్నికల పరిస్థితి ఈ ఎన్నికల్లో లేదన్నది పోలింగ్ జరిగిన తర్వాత వెలువడుతున్న అభిప్రాయం. జనసేన అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేయడంతో పోరు ఆసక్తికరంగా మారిందంటున్నారు. సజ్జల ఎవరి ఓట్లు చీల్చుతారో అన్న ఉత్కంఠ ఇరు పార్టీలోనూ ఉంది. అయితే భూమాకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండటంతో ఆయన ఉప ఎన్నికల్లో గెలిచినంత ఈజీ కాదన్నది వాస్తవం. మొత్తం మీద ఈసారి శిల్పా కుటుంబంలో ఎవరు అసెంబ్లీలోకి అడుగుపెడతారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Related Posts