YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజీల గందరగోళం

అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజీల గందరగోళం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రంలోని 44 ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది. ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్‌ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి  అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్‌ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది.జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 7లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్‌టీయూహెచ్‌ పేర్కొనగా, వచ్చే నెల 15లోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.  మరో వైపు ద్యార్థులు తక్కువగా ఉన్న, విద్యార్థులు లేని ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. డిమాండ్‌ లేని కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 11 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. 2018–19 విద్యా సంవత్సరంలో తమకు అనుబంధ గుర్తింపు అవసరం లేదని, తమ కాలేజీలు మూసివేసుకుంటామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యాజమాన్యాల నుంచి జేఎన్టీయూహెచ్‌ ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 266 ఇంజనీరింగ్‌ (బీటెక్‌) కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 11 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, ఫ్యాకల్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు జేఎన్టీయూహెచ్‌ సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల  తనిఖీల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కాలేజీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. ఈసారి కొత్త కోర్సులను ఇచ్చేది లేదని ఏఐసీటీఈతోపాటు జేఎన్టీయూహెచ్‌ కూడా చెబుతుండటం, గడిచిన మూడేళ్లలో 25 శాతం లోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గనుంది.8 ఇంజనీరింగ్‌ కాలేజీలు 11 రకాల బీటెక్‌ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. డిమాండ్‌ లేని కోర్సులను మూసి వేసుకుంటామని వెల్లడించాయి. దీంతో భారీ గా సీట్లు రద్దు కానున్నాయి. అలాగే 28 ఎంటెక్‌ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో 15 వేల వరకు ఎంటెక్‌లో సీట్లు ఉండగా గతేడాది వాటిని జేఎన్‌టీయూహెచ్‌ 5,400కు పరిమితం చేసింది. ఈసారి 77 బ్రాంచీల రద్దుతో ఎంటెక్‌ సీట్ల సంఖ్య 3 వేల లోపే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాం చీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.

Related Posts