ఖరీఫ్-2019కి అవసరమైన సబ్సిడీ విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు పూర్తి చేసింది. అన్ని రకాల విత్తనాలకు సంబంధించి జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని అందుబాటులో ఉంచింది. గత మూడేండ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా విత్తనాల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఖరీఫ్‌కు 9.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయబోతున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో 1,78,604 క్వింటాళ్ల విత్తనాలను బఫర్ స్టాక్‌గా అందుబాటులో పెట్టగా, అందులో వరి విత్తనాలు 29,215 వేల క్వింటాళ్లు. మొత్తం రెండు లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలకు గాను, ప్రస్తుతం 38 వేల క్వింటాళ్ల విత్తనాలు అందు బాటులో ఉన్నాయి. వీటిని సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, జీలుగ, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం తదితర విత్తనాలను కూడా ఖరీఫ్ కోసం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఒక మెళికపెట్టింది. సబ్సిడీ విత్తనాలు కోరుకునే రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది.ఈ ఖరీఫ్‌కు సంబంధించి 38 వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను మూడు సంస్థల ద్వారా సరఫరా చేయనుంది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎస్‌డీసీ), హైదరాబాద్ అగ్రికల్చర్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌సీ), హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) సంస్థల ద్వారా 38 వేల క్వింటాళ్ల విత్తనాలు అందనున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోయాబీన్ అత్యధికంగా సాగు చేయడం వల్ల ఆ జిల్లాల్లోనే ఈ విత్తనాలను ఎక్కువ అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
పంటలు క్వింటాళ్లు
వేరుశనగ 4250
వరి 29215
జొన్న 1250
మొక్కజొన్న 44849
మినుములు 2528
పెసర 2902
కందులు 16512
నువ్వులు 550
పొద్దుతిరుగుడు 650
ఆముదాలు 1000
జీలుగ 28508
జనుము 6405
పిల్లిపెసర 2984
స్టేట్ బఫర్ 178604
మొత్తం 750000