YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫోనితో వణుకుతున్న ఉత్తరాంధ్ర

ఫోనితో వణుకుతున్న ఉత్తరాంధ్ర
'ఫొని’ పెను తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షానికి తోడు తీవ్రమైన ఈదురుగాలులు తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. తుపాను శుక్రవారం శ్రీకాకుళంలో తీరానికి 40-50 కిలోమీటర్ల సమీపంలోనే ప్రయాణించే అవకాశం కనిపిస్తుండటంతో ఆ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇచ్ఛాపురం, గంజాం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.‘ఫొని’ పెను తుపాను బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తీసుకుని గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుకు యాంటీ సైక్లోన్‌ అడ్డు రావటంతో అది దిశ మార్చుకుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం(3న) శ్రీకాకుళం జిల్లా తీరంతో పాటు ఒడిశా తీరంలో 170 - 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ జారీచేశారు.తుపాను శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది ఉత్తర కోస్తాకు దగ్గరగా పయణించనుండటంతో గురు, శుక్రవారాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరం, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల్లో నేడు, రేపు సముద్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. విశాఖ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్కే బీచ్‌లోకి సందర్శకులను అధికారులు అనుమతించటం లేదు. ఇక్కడ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల్లో సముద్రం ఉప్పొంగే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.‘ఫొని’ పెను తుపాను ప్రభావంతో కుర్థా రోడ్‌ డివిజన్‌ పరిధిలో 103 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఒడిశాలోని భద్రక్‌ నుంచి ఏపీలోని విజయనగరం జిల్లాల మీదుగా నడిచే అన్ని రైళ్లు 2వ తేదీ సాయంత్రం నుంచి రద్దు చేశారు. పూరీ నుంచి హావ్‌డా వెళ్లే రైళ్లన్నీ 2వ తేదీ అర్థరాత్రి నుంచి రద్దు చేశారు. పూరీ నుంచి బెంగళూర్, చెన్నై, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైళ్లను 2వ తేదీ సాయంత్రం నుంచి రద్దు చేశారు. పూరీ నుంచి బయలుదేరే రైళ్లతో పాటు పూరీ, భవనేశ్వర్‌ మీదుగా వచ్చే రైళ్లను 3వ తేదీన రద్దు చేశారు. ఈనెల 2న విశాఖపట్నం చేరుకొనే రైలు నెం.12509 బెంగళూరు సిటీ నుంచి గౌహాటి వెళ్లే రైలు విజయనగరం-టిట్లాఘర్‌-జార్సుగూడ, ఈనెల 3న విశాఖపట్నానికి చేరుకొనే రైలు నెం.18507 విశాఖపట్నం నుంచి అమృత్‌సర్‌ వెళ్లే రైలును విజయనగరం-టిట్లాఘర్‌-సంబల్‌పూర్‌ల మీదుగా దారి మళ్లించారు.
సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది తరలింపు
ఫొని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలోని పూరీకి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఒడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే 103 రైళ్లను రద్దు చేసింది. హౌరా - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్, పాట్నా - ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్, హౌరా - హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ - రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఒడిశాలోని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతుంది. పూరీ నుంచి కోల్‌కతాలోని శాలీమర్ వరకు ఈ ప్రత్యేక రైలు నడవనుంది. కుర్ధా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కేందూజర్ రోడ్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్ మీదుగా కోల్‌కతా వెళ్లనుంది ప్రత్యేక రైలు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం తుఫాన్ ముప్పు పొంచి ఉన్న తీర ప్రాంతాల్లోని సుమారు 8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది. పర్యాటకులు బుధవారం సాయంత్రానికల్లా పూరీ విడిచివెళ్లాలని సూచించింది. మరోవైపు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు నౌకాదళం, వైమానిక దళం, కోస్ట్ గార్డ్ సిబ్బందికి హై అలర్ట్ ప్రకటించారు.

Related Posts