YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జంపింగ్ జంపాంగ్ లు న్యాయం జరిగేనా

 జంపింగ్ జంపాంగ్ లు న్యాయం జరిగేనా

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

వర్తమాన రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. అధికారమే పరమావధిగా పాతా, కొత్తా తేడా లేకుండా అందరి నాయకుల అడుగులు పడుతున్నాయి. సరిగ్గా పోలింగ్ ముందు రోజు కూడా అటునుంచి ఇటు ఇటునుంచి అటు జంపింగులు జరిగాయి. వారి వల్ల పార్టీకి ఎంతవరకూ లాభం జరిగిందో తెలియదు కానీ చేరిన పార్టీ అధికారంలోకి వస్తే దక్కే పదవులే వారిని అలా నడిపించాయనుకోవాలి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ విధంగా ఇద్దరు కీలక నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చివరి నిముషంలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఏళ్ల నాటి వైసీపీ బంధం తెంచుకుని టీడీపీ సైకిలెక్కేశారు. ఇక రాజకీయ రంగ ప్రవేశమే వైసీపీ నుంచి చేసిన ఆరు నెలలకే టీడీపీలోకి చేరి ఫక్తు పొలిటీషియన్ అనిపించుకున్నారు ఓ డాక్టర్ గారు. వీరు కచ్చితంగా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. అయితే ఒకవేళ తేడా కొడితే సంగతేంటన్నది ఆ పార్టీలోనే పెద్ద చర్చగా ఉంది.తైనాల విషయానికి వస్తే వైసీపీ పుట్టుక నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. నిజాయతీపరునిగా పేరు తెచ్చుకున్నారు. ఒకమారు ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లొ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే 2014 ఎన్నికలతో పాటు, తాజా ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. దానికి బదులుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం చివరి వరకూ పనిచేస్తూ వచ్చిన తైనాల ఉన్నట్లుండి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఎమ్మెల్సీ హామీ మాత్రమే లభించిందని అంటున్నారు. మరి ఎందువల్ల ఆయన పార్టీ మారారు అన్నది ఆయన అనుచరులకే అంతుబట్టడంలేదు. వైసీపీలో చాలామంది నాయకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉండగా కొత్తగా వచ్చిన తైనాలకు కీలకమైన పదవి ఇచ్చే పని కాదని కూడా అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆయనకు నామినేటెడ్ పదవి దక్కేదని, ఆయన తొందర పడ్డారని అన్న వారూ ఉన్నారు. మరి రేపటి రోజున వైసీపీ పవర్లోకి వస్తే తైనాల తిరిగి ఆ పార్టీలోకి జంప్ చేస్తారా అన్న చర్చ సాగుతోంది.ఇక దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉంటూ విశాఖ నగరంలో మేధావిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ రమణమూర్తి హఠాత్తుగా టీడీపీలోకి ఫిరాయించడం ఈ ఎన్నికల్లో చెప్పుకోదగిన విశేషం. ఆయన ఆరు నెలల క్రితమే వైసీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అటువంటిది ఆయన అంతలోనే పార్టీలు మార్చడం ఆయన కెరీర్ మీదనే మచ్చ పడేలా చేసిందని అంటున్నారు. విశాఖ సౌత్ అసెంబ్లీ ఇంచార్జిగా ఆయన్ని జగన్ నియమించారు. అయితే సర్వేల్లో ఆయనకు వ్యతిరేకంగా రావడంతో జగన్ టికెట్ ఇవ్వలేకపోయారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే డాక్టర్ గారు పార్టీ మారిపోయారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆయన రాజకీయం పూర్తిగా ముగిసిపోయినట్లేనని కూడా మాట వినిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లొ ఇలాంటి వారు అనేకమంది ఉన్నారు. వారి జాతకాలు ఏమవుతాయో ఎన్నికల ఫలితాలే చెప్పాలి మరి.

Related Posts