యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
రాజకీయాలకు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. క్రికెట్ లో కెరీర్ ముగిశాక కొందరు ఆటగాళ్ల దృష్టి రాజకీయాలపై మళ్లుతుంది. క్రికెటర్ గా ఉన్న ప్రజాభిమానంతో రాజకీయాల్లో రాణించవచ్చన్నది వారి నమ్మకం. అదే విధంగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కొందరి దృష్టి బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల అధ్యక్ష,కార్యదర్శి పదవులపై ఉంటుంది. శరద్ పవార్ వంటి దిగ్గజ నేత ఒకప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా కూడా గతంలో బీసీసీఐ ఛైర్మన్ గా పనిచేశారు. తెలంగాణకు చెందిన రాజకీయనాయకుడు, మాజీ మంత్రి జి.వినోద్ కొంతకాలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు కూడా అధికార బీజేపీ నాయకుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు కోకొల్లలు.అదే సమయంలో కెరీర్ ముగిసిన క్రికెటర్లు ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించారు. అలాంటి వారిలో కీర్తి ఆజాద్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ముఖ్యులు. కీర్తి ఆజాద్ బీహార్ నుంచి బీజేపీ ఎంపీగా గతంలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరి జార్ఖండ్ రాష్ట్రంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి బీజీపీ ఎంపీగా ఎన్నికైన క్రికెటర్ సిద్దూ ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ప్రధాని అయ్యారు. వీరి స్ఫూర్తితో ఏటా ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.తాజాగా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ తూర్పు లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 1981 అక్టోబరు 14న జన్మించిన ఈ ఎడమచేతి బ్యాట్స్ మెన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా, ఆరు వన్ డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లకు భారత్ కెప్టెన్ గా వ్యవహరించారు. 2007, 2011 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ ముగిసిన అనంతరం ఈ ఏడాది మార్చి 22న కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ , రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరారు. 1966లో ఏర్పాటైన తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. 16 లక్షలకు పైగా ఓటర్లు గల నియోజకవర్గం 40 మున్సిపల్ వార్డుల్లో విస్తరించి ఉంది. దేశంలోని పెద్ద నియోజకవర్గాల్లో ఇది ఒకటి. దీని పరిధిలో జంగ్ పుర, ఓఖ్లా, త్రిలోక్ పురి, కొండ్లి, ప్రతాప్ గంజ్, లక్ష్మీనగర్, విశ్వనగర్, కృష్ణనగర్, గాంధీనగర్, షాదర అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహేష్ గిరి గెలుపొందారు. ఆప్ అభ్యర్థి రాజమోహన్ గాంధీని ఓడించారు. 47. 80 శాతం ఓట్లను సాధించారు. మొత్తం 18.29 లక్షల మంది ఓటర్లుండగా, వారిలో 10.23 లక్షల మంది పురుషులు. బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్, ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులుగా అతిష్, అర్విందర్ సింగ్ లవ్లీ బరిలో ఉన్నారు. 1966లో నియోజకవర్గం ఆవిర్భావం అనంతరం 1967లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అప్పటి జన్ సంఘ్ గెలిచింది. నియోజకవర్గంలో బీజేపీకి పట్టున్న మాట వాస్తవమే. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నామమాత్రం. 2004లో అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రెండు ఓటర్ కార్టులు కలిగి ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఇక్కడి తీన్ హజారీ కోర్టులో ఒక ఫిర్యాదు దాఖలు చేసింది. గంభీర్ పై తక్షణం అనర్హత వేటు వేయాలంటూ ఆప్ అభ్యర్థి అతీష్ డిమాండ్ చేశారు. ఆయనకు కరోల్ బాగ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని, ఇందుకు ఏడాది జైలు శిక్ష ఎదుర్కొనాల్సి వస్తుందని ఆప్ అభ్యర్థి అతీష్ హెచ్చరించారు. ఇప్పుడుకాక పోయినా, భవిష్యత్తులో అయినా గంభీర్ పై అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అటువంటి వ్యక్తికి ఓటువేసి తమ ఓటును వృధాచేసుకోవద్దని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. అయితే ఆప్ ఆరోపణ అవాస్తవమని, తనకు రాజేంద్రనగర్ లోనే ఓటు ఉందని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం పరిధిలో ఉందని గంభీర్ వెల్లడించారు. ఆప్ ఫిర్యాదు వచ్చే నెల మొదటి వారంలో విచారణకు రానుంది. మొత్తమ్మీద ఢిల్లీ తూర్పు లోక్ సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది.