యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వన్డే, టెస్టుల్లో గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న పాకిస్థాన్ టీ20ల్లో మాత్రం ఆధిపత్యం చెలాయిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో 286 పాయింట్లు సాధించిన పాకిస్థాన్ నెం.1 స్థానంలో నిలిచింది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డేల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్ జట్టు అనూహ్యంగా 260 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం. టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తర్వాత 262 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఇంగ్లాండ్ (261), ఆస్ట్రేలియా (261), భారత్ (260) టాప్-5లో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూజిలాండ్ (254) ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (241), శ్రీలంక (227), వెస్టిండీస్ (226), బంగ్లాదేశ్ (220) టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. 2016 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఏకంగా 9వ స్థానానికి పడిపోవడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. ఐసీసీ ఇక నుంచి 80 జట్లకి సంబంధించిన టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు జాబితాలో యూఏఈ, నమీబియా, హాంకాంగ్, నెదర్లాండ్స్, గన్యా, నైజీరియా, దక్షిణ కొరియా తదితర జట్లు కూడా చేరాయి.