యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్య్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. సీఎస్‌ను రివ్యూలకు రమ్మని అడుక్కోవాలా.. అన్ని రాష్ట్రాల్లో సీఎం వద్దకు సీఎస్ వెళ్లి రిపోర్ట్ చేస్తారు.. ఇక్కడ మాత్రం సీఎస్ సీఎం దగ్గరకు రారు అంటూ మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ వేరు పరిపాలన వేరు అని తెలుసుకోరా.. వచ్చేవారం కేబినెట్ మీటింగ్ పెడతా.. కోడ్ పేరుతో అధికారుల్ని ఎలా ఆపుతారో చూస్తానంటూ ఫైరయ్యారు. ఫణి తుఫాన్‌పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. సీఎస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫణి తుఫాన్‌పై సమీక్ష తర్వాత చంద్రబాబు సీఎస్ వ్యవహారంపై మాట్లాడారు.‘అన్ని రాష్ట్రాల్లో సీఎస్ లు సీఎం దగ్గరకొచ్చి వివరిస్తారు- మన రాష్ట్రంలో మాత్రం అలా చేయరు.. నేను అడుక్కోవాలా. మీరు చదువుకోలేదా.. రాజ్యాంగం ఏం చెబుతుందో తెలియదా. ఎలక్షన్, నాన్ ఎలక్షన్ వ్యవహారాలు ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదా.. అందుకే సిస్టమ్ ను కరెక్ట్ చేసేందుకు నేను పోరాడుతున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇష్టానుసారంగా చేస్తాం, రివ్యూలకు రామంటే ఎలా.. డెవలప్ మెంట్ కూడా ఈసీకి రిపోర్ట్ చేస్తారా.. బిజినెస్ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలసుకోవాలిగా’అంటూ మండిపడ్డారు. ‘అధికారుల్లో చీలిక తేవాలనుకోవడం లేదు.. కానీ బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరిస్తే మాత్రం ఊరుకోను. ఈ సీఎస్ మూడు నెలలుండొచ్చు.. నేను 22 ఏళ్లుగా సీఎంగా ఎన్నో ఎన్నికలు చూశా.ఇదే నాకు మొదటి ఎన్నిక.. చివరి ఎన్నిక కాదు. ఈసీ కూడా రూల్స్ అన్నీ ఫాలో కావాలి. మోదీ చేసింది తప్పనే నేను పోరాడుతున్నా.. ఈడీ, ఐటీలను పంపిస్తారని నేను భయపడాల్సిన అవసరం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇంకో రాజ్యాంగ వ్యవస్థలో తల దూరిస్తే సంక్షోభం వస్తుంది. కొంతమంది అధికారాన్ని తాత్కాలికంగా మిస్ యూజ్ చేసినా.. విర్రవీగినా తర్వాత సిస్టమ్‌ను కరెక్ట్ చేయాల్సి ఉంటుంది’అన్నారు ‘ఎలక్షన్ డ్యూటీల వరకు ఈసీకి నివేదిక ఇవ్వాలి.. మిగతా వ్యవహారాలన్నింటిపై అధికారులంతా నాకు రిపోర్టివ్వాలి. వచ్చే వారంలో కేబినెట్ మీటింగ్ పెట్టి బిజినెస్ రూల్స్ వయొలేట్ చేసేవారిపై సీరియస్ చర్యలు తీసుకుంటాం.ఈసీ వద్దంటే రాతపూర్వకంగా ఇవ్వాలి.. కేంద్రం 4 కేబినెట్లు పెట్టలేదా.. కేబినెట్ సమావేశాలు, రివ్యూలు పెట్టకూడదనే రూల్ ఎక్కడుంది. అధికారులు మాకు కాకుండా ఈసీకి రిపోర్ట్ చేయాలనే రూల్ ఎక్కడుంది. 22 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. విభజన తర్వాత కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్న అనుభవం ఎవరికుంది’అన్నారు.