యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
కిల్లి కృపారాణి.. మాజీ కేంద్ర మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ లో దశాబ్దకాలం పాటు ఉన్న నేత. సిక్కోలు జిల్లాలో కిల్లి కృపారాణి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కొంత అనుకూలత లభిస్తుందనే చెప్పాలి. ముందుగా ఆమె వైద్యురాలు. ప్రముఖ ఆసుపత్రి నిర్వహిస్తూ కిల్లి కుటుంబం ప్రజలకు చేరువయింది. అంతేకాదు ఆమె సామాజికవర్గం సిక్కోలు జిల్లాలో బలంగా ఉండటమూ ఆమెకు కలసి వచ్చింది. అందుకే ఆమె శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలుగా గెలిచి కేంద్ర మంత్రి కాగలిగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారని చెప్పాలి.కిల్లి కృపారాణి చివరి నిమిషం వరకూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీకి పొత్తు కుదరితే తనకు శ్రీకాకుళం పార్లమెంటు స్థానమైనా, జిల్లాలో మరేదైనా అసెంబ్లీ స్థానమైనా దక్కుతుందని ఆశపడ్డారు. కానీ పొత్తు లేదని తేలడంతో ఆమె చివరి క్షణంలో వైసీపీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్న కిల్లి కృపారాణికి వైఎస్ జగన్ ఖచ్చితంగా సీటు ఇస్తారని అందరూ భావించారు. కిల్లి కూడా ఆశపడ్డారు. ఒకదశలో టెక్కలి అసెంబ్లీ నుంచి కిల్లి కృపారాణి బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరిగింది.కానీ పార్టీ మారినా టిక్కెట్ దక్కలేదు. అయితే జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించిందట. సీనియర్ నేత ధర్మానప్రసాదరావు అభ్యంతరాన్ని కూడా జగన్ లెక్క చేయకుండా కిల్లికి ప్రాధాన్యమిచ్చారట. అందుకే కిల్లి కృపారాణి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి బాగా కృషి చేశారంటున్నారు. అభ్యర్థులకన్నా ఎక్కవగా ఆమే తిరిగారన్నది వైసీపీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. కిల్లి కృపారాణి కాళింగ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో బలంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే గెలుపోటములు నిర్ణయించేది ఈసామాజిక వర్గమే. ఇన్నాళ్లూ ఈ సామాజికవర్గంలో చీలికల వల్ల టీడీపీ గెలుస్తుందని, అయితే ఈసారి కాళింగులను మొత్తాన్ని ఏకం చేశారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కష్టపడ్డా కిల్లి కృపారాణికి ఏ పదవి దక్కుతుందన్న ఆసక్తి సిక్కోలులో చర్చనీయాంశంగా మారింది. జగన్ కిల్లికి ఏం హామీ ఇచ్చారన్న దానిపై కూడా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. కొందరు కిల్లికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనిచెబుతుండగా, మరికొందరు మాత్రం ఆమెను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి జగన్ ఖచ్చితంగా తీసుకుంటారని ఆమె వర్గీయులు పందేలు మీద పందేలు కాస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి వస్తేనే ఏదైనా జరిగేది. వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఎవరూ ఊహించని పదవి కిల్లికి జగన్ కట్టబెడతారన్న టాక్ మాత్రం సిక్కోలులో బలంగా విన్పిస్తుంది. మరి ఆమె లక్ ఎలా ఉందో చూడాలి