యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
పశ్చిమ గోదావరి జిల్లా గత ఎన్నికల్లో సంచలనం సృష్టించిన జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్పీప్ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీరో కే పరిమితమయింది. గత ఐదేళ్ల నుంచి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పదిహేను నియోజకవర్గాలు ఉన్న ఈ జిల్లా అధికార పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయిస్తుంది. అందుకోసమే జగన్ ఐదేళ్ల పాటు స్పెషల్ ఆపరేషన్ చేశారు. యువభేరి పెట్టినా, బీసీ సదస్సు పెట్టినా, కొల్లేరు సమస్య, పోలవరం ముంపు గ్రామాల సమస్య, ఇసుక మాఫియా ఇలా ఒకటేంటి..? అనేక సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లాను వేదికగా తీసుకుని పోరాటాలు చేసి జనానికి జగన్ చేరువయ్యారు. వైసీపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో తగిన స్థానాలు ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే. ఇది అందరూ అంగీకరించే విషయమే.అందుకే ప్రతి పార్టీ ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరుపుతాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించేందుకు ఇరు పార్టీలు ఈ ఎన్నికల్లో కూడా ప్రయత్నించాయి. అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశముందని వైసీపీ నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలుంటే అందులో ఎనిమిది వైసీపీ, ఆరు టీడీపీ గెలుచుకుంటుందన్న లెక్కలు వేస్తున్నారు. ఒక్క భీమవరంలో మాత్రం గెలుపు ఎవరిది అని చెప్పడం కష్టంగా ఉందట. వైసీపీ నేతల లెక్కల ప్రకారం జిల్లాలోని కొవ్వూరు, నర్పాపురం, తణుకు,ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెబుతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలో చేరడంతో నర్సాపురం స్థానం తమ పరంఅవుతుందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, ఉండి, తాడేపల్లి గూడెం, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉండటం, అభివృద్ధి పనులు వేగంగా జరగడం, సంక్షేమ కార్యక్రమాలు కిందిస్థాయికి వెళ్లడంతో గెలుపు సులవువుతుందని టీడీపీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. ఇక భీమవరం నియోజకవర్గంలో మాత్రం టఫ్ ఫైట్ జరిగిందంటున్నారు. ఇక్కడ వైసీపీ, జనసేనల మద్యనే పోటీ ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడంతో గెలుపు ఎవరదనేది అంచనా వేయడం కష్టంగా మారిందంటున్నారు.మొత్తం మీద వైసీపీ ఈసారి జీరో నుంచి ఎనిమిది స్థానాలు చేరుకుంటుందన్న ధీమాతో వైసీపీ నేతలున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.