యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆకలి చావులంటే ఠక్కున గుర్తొచ్చేది సోమాలియా లాంటి ఆఫ్రికా దేశాలు. కానీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా గుర్తింపు పొందిన మనదేశంలోనూ చిన్నారుల ఆకలి చావులు వెక్కిరిస్తున్నాయి. రెండంకెల వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న ఏపీలో ఆకలి బాధలేక తాళలేక చిన్నారి మట్టి తిని ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. 1971లోనే గరీభీ హఠావో అని నినదించినా.. 2019లోనూ రోజుకు ఒక్క పూట కూడా భోజనం చేయలేని పేదలకు కొదవలేదని అనంతపురం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘటన రుజువు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..పదేళ్ల క్రితం కర్ణాటక నుంచి వలస వచ్చిన మహేష్, నీలమణి దంపతులు కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో స్థిరపడ్డారు. కూలి పనులు చేసుకొని జీవించే వీరికి ఐదుగురు సంతానం. ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో డేరా వేసుకొని తలదాచుకుంటున్నారు. ఆరేళ్ల వయసున్న సంతోష్ అనే బాబు ఆరు నెలల క్రితం పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురై చనిపోయాడు. నీలమణి అక్క కూతురైన రెండేళ్ల వెన్నెల, నాగమణి తల్లి కూడా వాళ్లతోనే ఉంటున్నారు. కూలీ పనులు లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వీరికి తినడానికి సరైన తిండి లేదు. దీంతో ఆకలి బాధ తాళలేక మట్టి తిన్న వెన్నెల అనార్యోగానికి గురై ప్రాణాలు విడిచింది. సంతోష్ కూడా మట్టి తిని చనిపోయాడని పొరుగున ఉండే వారు చెప్పారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. పదేళ్లుగా కదిరిలోనే ఉంటున్నా.. వీరికి కనీసం రేషన్ కార్డు కూడా లేదు. వెన్నెల ఆకలి చావు విషయం వెలుగులోకి రావడంతో.. అధికారులు ఇప్పుడు స్పందిస్తున్నారు. ఈ కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని.. మహేష్, నీలమణికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇస్తామని ఆర్డీవో అజయ్ కుమార్ తెలిపారు. ముగ్గురు చిన్నారులను శిశు సదన్ కేంద్రాల్లో చేర్పిస్తామన్నారు. పాప మట్టి తిని చనిపోయిన ఘటనపై బాలల హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాసింది. పాప మరణానికి ప్రభుత్వ అధికారులదే బాధ్యత అని బాలల హక్కుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా చూడటం, వాటి పట్ల అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు, అమ్మమ్మ మద్యానికి బానిసలయ్యారని.. పిల్లల ఆలనాపాలనా సరిగా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. సరిగా తిండి పెట్టకపోవడంతోనే పిల్లలు చనిపోయారని కదిరి ఇన్స్‌పెక్టర్ ఇస్మాయిల్ వెల్లడించారు. రెవెన్యూ అధికారుల విచారణలోనూ ఇదే తేలింది. వెన్నెల ఆరోగ్యం విషమించినా వారు హాస్పిటల్‌కు తీసుకెళ్లలేదని హెల్త్ వర్కర్లను కూడా సంప్రదించలేదని చెప్పారు